తెలంగాణ : ‘ఇది విశ్వాస ఘాతుకానికి నిదర్శనం` అని సిఎం రేవంత్ రెడ్డి పోస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయంపై సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. ఇంధన ధరల పెంపు అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మోడి ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని విమర్శించారు. ‘ఆత్మనిర్భర్’ అనే నినాదం కేవలం ఓట్లు సాధించడానికి ఉపయోగించిన రాజకీయ నినాదమే తప్ప, ఆశించిన ఫలితాలు ఇచ్చిన విధానం కాదని వ్యాఖ్యానించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయని, యువతకు ఉపాధి భద్రత లేకుండా పోయిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని, అది కేవలం మాటలకే పరిమితమైందన్నారు. గత పదేళ్లుగా రూపాయి విలువ క్రమంగా పడిపోతూ వచ్చిందని, ప్రస్తుతం ఆ పరిస్థితి మరింత తీవ్రమైందని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపించి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం సామాన్యుల నడ్డి విరిచే చర్యగా అభివర్ణించారు. ప్రపంచంలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని గొప్పలు చెప్పుకుంటున్న మోడి ప్రభుత్వం.. ఇప్పుడు ధరల పెంపును ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. ఇటీవల నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల ముందు “పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచబోమని కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రకటించిందని గుర్తు చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన పది రోజులు కూడా గడవకముందే లీటరుకు రూ.3 కుపైగా ధరలు పెంచడం ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేయడమేనని మండిపడ్డారు. కేవలం ఓట్ల కోసం,ఎన్నికల విజయాల కోసం మోడి అబద్ధాలు చెబుతున్నారని ప్రజలు భావిస్తున్నారని, ఇది విశ్వాస ఘాతుకానికి నిదర్శనమని విమర్శించారు. చివరగా కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
‘ఇది విశ్వాస ఘాతుకానికి నిదర్శనం` : సిఎం రేవంత్ రెడ్డి
16 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 16, 2026, 06:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)