test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఉబ్బి పోతున్నారా !

12 మే, 2026

katha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 12, 2026, 06:32 అపరాహ్నం | 5 నిమిషాల చదవడం

ఉదయం నిద్ర లేచిన గోపాలానికి బాడీ భారంగా అనిపించింది. గాబరా పడుతూ లేచాడు. నిలువుటద్దంలో చూసుకున్న గోపాలం ‘కెవ్వుమని’ అరిచాడు. తల తప్ప మిగతా పార్ట్ అంతా ‘హల్క్’లా కొంచెం ఉబ్బిపోయి ఉన్నాడు. _సొల్యూషన్ కోసం డాక్టర్ ముకుందాన్ని కలిశాడు._‘డాక్టర్! ఉదయం లేచేసరికి ఇలా లావైపోయాను’ అన్నాడు.
గాలి బ్లాడర్ తొడుక్కున్నవాడిలా గోపాలం తమాషాగా కనిపించాడు డాక్టర్ ముకుందానికి. నవ్వొచ్చింది.. గోపాలం కడుపులో కుడి చూపుడు వేలుతో_ నొక్కి చూశాడు. గోపాలం కూడా తన చూపుడు వేలుతో డాక్టర్ని నొక్కాడు బదులుకు బదులుగా. ఈసారి ఖాళీ నీడిల్ తీసుకొని, ఠప్ మని గోపాలం కడుపులో కసుక్కున పొడిచాడు ముకుందం. లోపల ఏదైనా గాలి ఉంటే సర్రున బయటకు వస్తుందని!._అపోహ పడిన గోపాలం ‘హయ్యో! అనవసరంగా పొడిచేశారు కదా!’ బాధగా మూలిగాడు.
‘కత్తితో మర్డర్ చేసానా? గొడ్డలితో నరికేసానా? ఉత్తినే టెస్ట్ చేసా! దానికీ కంగారు పడడమేనా’_ ఉరిమి చూశాడు డాక్టర్.
డాక్టర్ పొడిచిన చోట తడుముకొని, ఏం కాలేదని నిర్ధారణ అయ్యాక ‘హమ్మయ్యా!’ అనుకున్నాడు._
గోపాలంని డైనోసర్ లా మింగేసేలా గుర్రుగా చూస్తూ ‘ఇంతకీ మీ పేరేంటో చెబుతారా?’ అడిగాడు డాక్టర్.
‘ఏనుగుల గోపాలం’
‘అద్గదీ సంగతి! ఇంటిపేరు ‘ఏనుగుల’ పెట్టుకొని ఊరికే ‘ఊరిపోయా’నంటూ వర్రీ అవుతారేం? ప్రాబ్లమ్ సాల్వ్ డ్!’
‘అలాగైతే నేనెప్పుడో లావైపోవాలిగా!’
‘అదీ పాయింటే! నిన్న అటవీ ప్రాంతానికిగాని వెళ్ళొచ్చారా?’
‘ఒక్క రోజేం కర్మ! ప్రతిరోజూ రాత్రుళ్ళు నిద్ర పట్టక అడవంతా తిరిగొస్తున్నాను. మీక్కూడా నాతో రావాలని సరదాగా ఉందా?’అంటూ గోపాలం, డాక్టర్ తో చమత్కారంగా అన్నాడు.
‘సన్నబడడానికి కొన్ని మందులైతే రాస్తున్నాను. వాకింగ్ లు, ఎక్సర్ సైజులు మర్చిపోవద్దు’ అన్నాడు డాక్టర్. ప్రిస్క్రిప్షన్ తో_ గోపాలం జంపయ్యాడు.
‘నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకోవాలి’ అనుకుంటూ అలా హోటల్ వైపు కదిలాడు. ఆర్డర్ ఇచ్చి, వెయిట్ చేయసాగాడు. ఎదురుగా ఓ కాలేజీ అమ్మాయి ఈ లోకాన్ని మరిచి ఫోన్ లో ఎవరితోనో బిగ్గరగా మాట్లాడుతోంది.
‘రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమల తర్వాత నేనే ఐదవ అందగత్తెనా? పో! మొద్దూ?’ సిగ్గుతో మెలికలు తిరిగిపోతోంది._
‘గట్టిగా గాలివీస్తే అవలీలగా అర కిలోమీటర్ కొట్టుకుపోయేంత సన్నగా ఉంది’
‘మహల్ కట్టించి ఆ మహల్ కి మహారాణిని చేస్తావా?’ ఆ అమ్మాయి నోటి నుండి వినపడుతున్న వాడి బడాయి మాటలకు తిక్కరేగింది గోపాలానికి.
‘ఇంకా నయం. అక్కడెక్కడో ఏడు సముద్రాల ఆవలనున్న అవంతీపుర రాజ్యానికి పట్టమహిషిని చేస్తాననలేదు’ గొణుక్కున్నాడు గోపాలం.
‘ఏంటి మధూ! నువ్వు మరీనూ! నీ గదిలోంచి దేవతల ఫోటో తీసేసి నా ఫోటో పెట్టేసావా?’
గాఢంగా నిట్టూర్చాడు గోపాలం.
‘అది సరే! ఇంతకీ ఇంత ఉదయాన్నే ఎందుకు ఫోన్ చేసినట్టు?..‌.ఏంటీ? నేను ముద్దు ఇవ్వనిదే టిఫిన్ ముట్టవా? మధూ! మరీ! పెంకి పిల్లోడిలా అయిపోతున్నా వేంటీ?’.. ఈ మాటలకు కోపగ్రస్తుడైన గోపాలం ఆ అమ్మాయి వైపు పరిశీలనగా చూసి అవాక్కయిపోయాడు.
ఎవరో ఆ అమ్మాయిపై_ ప్రయోగించినట్లు! ఐరావతానికి ఆడపడుచులా కాసింత ఉబ్బిపోయి ఉంది. గోపాలం అంతెత్తున ఎగిరిపడ్డాడు! తనలాగే ఈ అమ్మాయి కూడా ఉన్నఫళంగా ఎందుకు ఊరిపోయినట్టు? బుర్ర బద్దలవుతుంటే టిఫిన్ కానిచ్చేసి ఇంటికి బయలుదేరాడు._ఉదయం పూట లీవ్ పెట్టిన గోపాలం మధ్యాహ్నం ఆఫీసుకి చేరుకున్నాడు._తన సెక్షన్ కు సంబంధించిన పెండింగ్ ఫైల్ పట్టుకొని, మేనేజర్ గదిలోకి వెళ్ళబోయి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. అక్కడొక రసవత్తర సన్నివేశం హిలేరియస్ కామెడీతో లైవ్ లో నడుస్తోంది. _సెలవు గ్రాంట్ చేసుకోవడానికి మేనేజర్ గదిలో తిష్టవేసిన శేషగిరి ఆల్రెడీ పంపు బయటకు తీసి, గాలి బాగా కొడుతున్నాడు.
‘మీరు బాగా స్ట్రిక్ట్ అని ఆఫీసులో హడలి చస్తున్నారండీ’
‘ఏం ఎందుకని?’
‘మీరు రారు. ఆఫీస్ కు మమ్మల్ని లేటు కానివ్వరుగా! ఫైల్స్ విషయంలోనూ పక్కాగా ఉంటారుగా! అందుకని’
‘ఏం అలా ఉండకూడదా?’
‘ట్రాన్స్ ఫర్ లో వెళ్లిపోయిన ఆఫీసర్ అలా కాదు సార్‌! వట్టి రబ్బరుబెండు. ఎటు వంచితే అటు బెండయ్యేవాడు’ పొగడ్తల దండను మెడలో వేసి గొర్రెను చేసేస్తున్నాడు.
‘మరి నేనో?’
‘మీకేం సార్! స్ట్రిక్ట్ అంటే వెరీస్ట్రిక్ట్! పనికి తప్ప, ఎవరికీ లొంగరు’ అని పళ్లు బయటపెట్టి శేషగిరి అన్నాడు. సారు సరదాగా ఉబ్బిపోతుంటే గోపాలం నెత్తిన పిడుగు పడ్డట్టు ఉలిక్కిపడ్డాడు. _అంటే తనొక్కడే కాదన్నమాట! ప్రపంచంలో తనలా ‘ఉబ్బి’ తబ్బిబ్బైపోతున్నవారు ఎందరో ఉన్నారన్నమాట! అప్పుడు బోధపడింది గోపాలంబుర్రకి! వెనక్కి వచ్చి తన సీట్లో కూలబడ్డాడు._
l l l
గోపాలం సాయంత్రం పూట భార్య వసుధ తెచ్చిచ్చిన కాఫీ తాగుతూ వాలు కుర్చీలో కూర్చున్నాడు._ ఫోన్ మోగడంతో ఎత్తాడు. ‘ఏమండీ! నేను పాండురంగడిని’ అని వినిపించింది.
‘చెప్పండి!’ నిన్న రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు వచ్చిందా సమయంలో గోపాలానికి. టీవీలో వార్తలు చూస్తుండగా వచ్చి ‘హి..హి…’ అని పళ్ళికిలించుకుంటూ గోపాలం ఎదుట నిలబడ్డాడతను. డైరెక్ట్ గా పేస్ట్ ఫ్యాక్టరీ నుండి జంపై వచ్చిన సేల్స్ మ్యాన్ లా కనిపించాడు.
‘నమస్కారం సార్!’ రెండు చేతులూ జోడించాడు. ‘నాపేరు పాండురంగడండీ! సీనియర్ ఎన్టీఆర్ పాండురంగ మహాత్మ్యం సినిమా రిలీజ్ టైమ్ లో పుట్టానని నాకా పేరెట్టారట! హీహీ!’
‘తమరిచ్చోటికి దయచేసిన కారణం బెట్టిదో_ సెలవీయండి చాలు’ గోపాలం కూడా అంతే రియాక్షన్‌ ‌చూపిస్తూ అన్నాడు.
‘ఈ మధ్యే ఈ వీధిలోకి అద్దెకు వచ్చానండీ! ఇక్కడొక లాఫింగ్ క్లబ్ ఓపెన్ చేద్దామని, ప్లాన్! దాని రిబ్బన్ కటింగ్ మీ చేతుల మీదుగా జరిపిద్దామని’
‘నాకంటే సీనియర్ సిటీజన్స్, టాలెంటెడ్ జూనియర్ సిటిజన్స్ బోలెడు మంది ఉన్నారుగా!’
‘సెటైర్ ల విత్తులేసి కామెడీ పండిస్తారటగా! మీ టాలెంట్ మీకు తెలీదు!’ అన్నాడు ఆ వ్యక్తి.
ఆ మాటకి గోపాలం మెలికలు తిరిగిపోతూ ‘తప్పదంటారా?’ అనడిగాడు.
‘కాకపోతే…’ అని నీళ్లు నమిలాడు.
‘కత్తెర్లు వేయకుండా, చెప్పండి ఏంటో?’ అన్నాడు గోపాలం.
‘ఆ వీధి చివరి రిటైర్డ్ వెంకటాచలం గారు లేరూ? రిబ్బన్ కటింగ్ తనకు అప్పజెప్పితే, పాతిక వేలు డొనేషన్ ఇస్తానన్నాడు క్లబ్ కి!’
‘పాతికవేలా?’ ఆశ్చర్యంగా చూశాడు గోపాలం.
‘మీరు టాలెంటెడ్. పాతికవేలు ఎందుకు ఇస్తారండీ? ఓ పది చాలు! మిమ్మల్నే ఫైనల్ చేస్తాను’.
దుర్ముహూర్తం ఎక్కడ దూసుకు వస్తుందోనని పక్కనున్న సెల్లు తీసి ఆయన నెంబర్ తీసుకుని పదివేలు ట్రాన్స్ఫర్ చేసేసాడు.
‘మీలాంటివారు వీధికొక్కరుంటే చాలండీ!’ ముకుళిత హస్తాలతో ఎప్పటిలా సంస్కారవంతంగా నమస్కరిస్తూ ఆ పెద్దాయన నిష్క్రమించాడు._
_అది గుర్తొచ్చిన గోపాలం ‘ఆ పెద్దాయన పొగడ్తలకి లొంగడంతోనే ఇలా ఉబ్బవలసి వచ్చిందన్నమాట!’ అని అర్థమై ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది.
‘మీ హస్తవాసి చాలా మంచిది సుమా! ప్రతి ఒక్కరూ కాదనకుండా మన క్లబ్ కి డొనేషన్ ఇస్తున్నారండీ!’ మళ్లీ ఆ పెద్దాయన ఫోన్ చేసి, అదే అస్త్రాన్ని బయటకు తీస్తుంటే.. ‘అస్సలు బెండవకూడదు’ అని గోపాలం దృఢంగా నిశ్చయించుకున్నాడు. _పొంగిపోకుండా ఈసారి బ్యాలెన్స్ గా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. _భార్య వసుధ కాంపౌండ్ వాల్ దగ్గర నిలబడి పక్కింటావిడతో ముచ్చటిస్తోంది. ఒక చెవిని వాళ్ళ మధ్యకు విసిరేశాడు.
‘వదినా! నీలాంటి చీర ఒక్కటైనా ఎప్పటికైనా కొనుక్కోవాలని నా జీవితాశయం. నెరవేరుతుందో? లేదో? చూడాలి మరి!’
‘ఎందుకో?’
‘ఎందుకంటావేంటి వదినా? ఎంత బాగుంటుందో నీ చీరల సెలక్షన్! ఫ్యాషన్ వి తెచ్చుకుంటావు. బాగుంటాయి. నీ సెలక్షన్ మా బంధువుల దగ్గర ప్రస్తావిస్తుంటాను’_
‘ఏమో వదినమ్మా! నీ అభిమానం. నా సెలక్షన్ లో గొప్పేముంది?’ లోపల ఆనందం ఎడాపెడా బ్యాడ్మింటన్ ఆడేస్తుంటే సంతోషాన్ని దాచుకోవడానికి గోపాలం భార్యకు తన గుండె సరిపోవడం లేదు.
‘ఆ కళ అందరికీ అబ్బదుగా వదినమ్మా! నీ నగల డిజైన్ కూడా ఎంత ట్రెండింగ్ గా ఉంటాయి? అలాంటివి చేయించుకోవాలనేది కూడా నాడ్రీమే!’ ఇంకాస్త డోస్‌ ‌పెంచి ఆవిడ అంటోంది.
‘అప్పటికే మేఘాల్లో తేలిపోయి, ఇమాజినేషన్లో వసుధ ఇరుక్కుని ఉంటుంది’ అనుకున్నాడు గోపాలం.
‘వదినా…ఓ_ వదినా!’ ప్రేమగా పిలిచిన ఆ పక్కింటావిడ రెండవ పిలుపుకి ఈ లోకానికి వచ్చింది వసుధ.
‘ఏదీ… ఆ రోజు శ్రావణ శుక్రవారం రోజున కట్టుకున్నావు చూడూ! ఎర్రంచు చిన్న చిన్న క్రీమ్ పూల పచ్చచీర. మా బంధువుల అమ్మాయి పెళ్లికి కట్టుకుంటాను. ఓసారి ఇవ్వవూ?’ అంటూ నవ్వుతూ అడిగింది.
‘దాందేముంది వదినమ్మా! ఆ చీరేమైనా అరిగిపోయేదా కరిగిపోయేదా? అలాగే ఇస్తాలే!’ ఠక్కున వరాన్ని ప్రసాదించింది వసుధ.
వసుధ_ పక్కింటావిడ పొగడ్తలకు పొంగి, ఉన్న సైజుకి కాస్తంత ఊరిపోయి కనిపించింది గోపాలానికి. _ప్రశంసలకు లొంగని వారు , పొగడ్తలకు ఉబ్బిపోని వారు ఎవరుంటారు? అనుకున్నాడు._చప్పున సెల్లు తీసి కింది వాక్యాలు టైప్ చేయడం ప్రారంభించాడు… ఇన్ స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో పెడదామని!
‘జనం వందిమాగధులై పోతున్నారు. ఎదుటి వారిని ఉబ్బించేసి, తమ పబ్బం గడుపు కుంటున్నారు. వాస్తవాన్ని విస్మరించి, వారి మాయలో పడబోకండి సుమా!._మీరు ఏంటో మీకు తెలిసినప్పుడు, వారి పొగడ్తలకు ఉబ్బిపోకండి! ఎదురుగా ‘పొగుడుతుంటారు’ వెనకేమో ‘పొడుస్తుంటారు’.
_అలాంటి వారి విషయంలటి
తస్మాత్ జాగ్రత్త!!_
ఉబ్బిపోకండేం!’​


– ఎనుగంటి వేణుగోపాల్,  94402 36055

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్