test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సత్యమేవ జయతే !

31 మే, 2026

Truth alone triumphs!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 31, 2026, 03:04 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​ అక్షర అనే అమ్మాయి మూడో తరగతి చదువుతోంది. ఆమె పుట్టినరోజుకు వాళ్ల తాతయ్య ఒక పెన్సిల్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆ పెన్సిల్ వెనుక వైపు ఒక చిన్న డైనోసార్ బొమ్మ ఉంది. అక్షర ఆ పెన్సిల్‌ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. ఒకరోజు స్కూల్లో లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి క్లాస్‌కి వచ్చేసరికి అక్షర బ్యాగులో ఉన్న పెన్సిల్ కనిపించలేదు. అక్షర ఏడుస్తూ క్లాస్ టీచర్ శాంతి రాగానే తన పెన్సిల్ పోయిన విషయం చెప్పింది.
‘పిల్లలూ! అక్షర పెన్సిల్ పొరపాటున మీ బ్యాగులలో కలిసిపోయిందేమో చూద్దాం. మీరంతా ఒక్కొక్కరు వరుసగా మీ బ్యాగు తీసుకుని వచ్చి చూపించండి’ అని టీచర్ చెప్పారు.
‘అలాగే మేడం..’ అంటూ ఒక్కొక్కరు టీచర్ దగ్గరకు వచ్చి బ్యాగులు తెరిచి చూపిస్తున్నారు. కిరణ్ అనే అబ్బాయి బ్యాగులో పెన్సిల్ చూడగానే అక్షర ‘మేడం, ఈ పెన్సిల్ నాదే!’ అంటూ అరిచింది.
‘మేడమ్! ఇది నా పెన్సిల్. మా నాన్న నిన్ననే కొన్నారు’ అన్నాడు కిరణ్.
‘కాదు మేడమ్, అది నాదే! దాని వెనుక డైనోసార్ బొమ్మ ఉంది చూడండి’ గట్టిగా ఏడుస్తూ అంది అక్షర.
‘షాపులో ఇలాంటి పెన్సిళ్లు చాలా అమ్ముతారు మేడమ్, ఇది అక్షర పెన్సిల్‌ అని తను ఎలా చెబుతుంది?’ అన్నాడు కిరణ్.
శాంతి క్షణం సేపు ఆలోచించి.. ఇద్దరినీ బ్లాక్ బోర్డు దగ్గరకు రమ్మని పిలిచారు. కిరణ్ చేతిలో ఉన్న పెన్సిల్‌ను టీచర్ తన చేతిలోకి తీసుకున్నారు.
‘మీరిద్దరూ వెనక్కు తిరిగి నిలబడండి. నేను ఈ పెన్సిల్‌తో బోర్డు మీద కాగితం పెట్టి నొక్కి ఒక పదం రాస్తాను. ఆ పదం రాసాక ఈ పెన్సిల్ మొన విరిగిపోయిందా? లేదా అలాగే ఉందా? అనేది ఎవరు కరెక్ట్‌గా చెప్తారో వాళ్లదే ఈ పెన్సిల్!’ అంది టీచర్.
కిరణ్, అక్షర బోర్డుకి వెనుక వైపుకి తిరిగారు.
టీచర్ బోర్డు మీద ‘సత్యమేవ జయతే’ అని రాశారు. ఆ తరువాత ఇద్దరినీ వెనక్కి తిరగమని చెప్పి, పెన్సిల్‌ మొదలు తన చేతిలోనే దాచేసింది.
కిరణ్ కంగారుగా బోర్డు వైపు చూశాడు. ‘మేడమ్! బోర్డు మీద నొక్కి రాసారు. నా పెన్సిల్ మొన విరిగిపోయుంటుంది’ అన్నాడు.
‘లేదు మేడమ్, పెన్సిల్ మొన అలాగే ఉంటుంది, విరగదు’ అంది అక్షర. శాంతి టీచర్ తన చేయి తెరిచి చూపించారు. పెన్సిల్ మొన విరగలేదు!
​ ‘మేడం, ఆ పెన్సిల్‌ను మా తాతయ్య వారం క్రితం నా పుట్టినరోజుకి ఇచ్చారు. అప్పటి నుండి నేను వాడుతున్నాను, అది మామూలు పెన్సిల్ కాదు, ‘లెడ్ పెన్సిల్’ అందులో బటన్ నొక్కితే లోపల నుండి చిన్న సన్నటి లిడ్ బయటకు వస్తుంది. దాంతో ఎంత గట్టిగా రాసినా మామూలు చెక్క పెన్సిల్‌లా చెక్కకుండానే మళ్ళీ వస్తుంది.’ అంది అక్షర.
‘అక్షర రోజూ పెన్సిల్‌ వాడుతోంది. కాబట్టి ఆమెకు తెలిసింది.. కిరణ్ మామూలు పెన్సిల్ అనుకుని అబద్ధం చెప్పి దొరికిపోయాడు’ అన్నారు టీచర్.
‘సారీ మేడమ్, అక్షర దగ్గర పెన్సిల్ అందంగా కనిపించడంతో ఆశపడి తీసుకున్నాను’ అని కిరణ్ తల దించుకున్నాడు.
‘కిరణ్! నేను మా తాతయ్యకు చెప్పి నీ కోసం కొత్త పెన్సిల్ తెప్పిస్తాను, నువ్వు బాధపడకు’ అని చేయి పట్టుకుని అంది అక్షర.
‘చూసావా కిరణ్! నువ్వు తప్పు చేసినా అక్షర నీతో స్నేహంగా మాట్లాడుతోంది. ఇక నుండి అడగకుండా ఎవరి వస్తువులూ తీసుకోకూడదు’ అని టీచర్ కిరణ్‌‌ను దగ్గరకు తీసుకుని, అర్థమయ్యేలా చెప్పారు. కిరణ్ మనసులో అభద్రతభావం తొలగిపోయి, ముఖం ప్రసన్నంగా మారింది.

కె.వి.సుమలత
9492656255


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్