సవాయిగూడెం అనే చిన్న గ్రామంలో రాజు అనే శిల్పి ఉన్నాడు.ఒకరోజు ఉదయాన్నే రాజు ‘మంజు! త్వరగా సద్ది (అన్నం) కట్టు. వెళ్లాలి’ అన్నాడు. వంటగదిలో నుంచి బయటకు వస్తూ మంజు ఆశ్చర్యంగా ‘ఏంటండీ.. ఉదయాన్నే హడావుడి? ఎందుకు?’ అంటూనే వంట పని పూర్తి చేసింది. పిల్లలను బడికి సిద్ధం చేసి, పంపించింది. మంజు వెంటనే భర్త దగ్గరకు వచ్చి ‘అసలు విషయం చెప్పండి’ అని అడిగింది.
రాజు నవ్వుతూ..‘వనపర్తిలో ఒక కొత్త గుడి కడుతున్నారు. అందులో విగ్రహాలు కావాలని ఆర్డర్ ఇచ్చారు. పని దొరికింది. ఎండ ముదిరితే రాళ్లను చెక్కడం కష్టం, త్వరగా సద్ది కట్టు’ అని చెప్పాడు.
‘సరేనండి.. జాగ్రత్తగా వెళ్ళి రండి` అని చమత్కరిస్తూ సద్ది మూటను సైకిల్‌కు కట్టింది మంజు. రాజు సైకిల్ ఎక్కి, గుట్ట వైపు బయలుదేరాడు. గుట్టకు చేరుకున్న రాజు, మంచి నల్లరాళ్లను చూసిఎంచుకుని, పని మొదలుపెట్టాడు. రోజంతా కష్టపడి మూడు రాళ్లను చెక్కాడు. కానీ అందులో ఒక రాయి మాత్రమే అందమైన శిల్పంగా మారింది. మిగిలిన రెండు రాళ్లూ ఉలి దెబ్బలకు తట్టుకోలేక ముక్కలైపోయాయి. సాయంత్రానికి ఇంటికి చేరాడు.
ఆ రాత్రి గుట్ట మీద ఉన్న రాళ్లన్నీ మాట్లాడుకోసాగాయి. పగిలిపోయిన రాళ్లు, శిల్పంగా మారిన రాయిని చూసి, వెటకారంగా నవ్వుతూ.. ‘మేము ఉలి దెబ్బలకు లొంగలేదు. కాబట్టి ఇక్కడే ఉన్నాము. నువ్వు అనవసరంగా దెబ్బలు తిని ఆకారాన్ని మార్చుకున్నావు’ అని ఎగతాళి చేశాయి. శిల్పంగా మారిన రాయి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది.
మరునాడు ఉదయాన్నే ఆలయ నిర్వాహకులు అక్కడికి వచ్చారు. విగ్రహంగా మారిన రాతి శిల్పానికి మంచి ధర చెల్లించి, తీసుకువెళ్లారు. పగిలిపోయిన రాళ్లను కూడా గుడి నిర్మాణానికి పనికి వస్తాయని ఉచితంగానే తీసుకుని వెళ్లారు. కొన్నిరోజుల తర్వాత ఆలయ నిర్మాణం పూర్తయింది. శిల్పంగా మారిన రాయిని గర్భగుడిలో ఉంచారు. పగిలిన రాళ్లను గుడి అడుగుభాగంలో మెట్లుగా వాడారు.
ఒకరోజు రాజు తన భార్యాపిల్లలతో కలిసి ఆ గుడికి వచ్చాడు. గర్భగుడిలోని విగ్రహాన్ని, తాము నిలబడిన మెట్లను పిల్లలకు చూపిస్తూ ఇలా అన్నాడు.
‘చూడండి పిల్లలు! ఉలి దెబ్బలను ఓర్చుకున్న రాయి ఈ రోజు ప్రజల గౌరవాన్ని అందుకుంటోంది. దెబ్బలకు భయపడి పగిలిన రాయి నిత్యం అందరి కాళ్ల కింద తొక్కిసలాటకు గురవుతోంది. జీవితంలో కష్టపడినప్పుడే విజయం మన చెంత చేరుతుంది. కష్టేఫలి అంటే ఇదే!’ అన్నాడు. తండ్రి చెప్పిన మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించిన ఆ పిల్లలు, క్రమశిక్షణతో చదువుకోవాలని నిశ్చయించుకున్నారు.
ఉప్పరి తిరుమలేష్
9618961384








కామెంట్‌లు (0)