test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరంజితమే...!

17 మే, 2026

vijay
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 17, 2026, 07:59 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

వెండితెరపై దళపతిగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న జోసెఫ్ విజయ్, ఇప్పుడు తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. వెండితెర సామాన్యుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, అగ్ర హీరోగా ఎదిగిన ఆయన, ప్రజల గొంతుకగా మారాలనే ఆకాంక్షతో 'తమిళగ వెట్రి కళగం' పార్టీని స్థాపించారు. నటుడిగా ప్రేక్షకులను రంజింపజేశారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా అట్టడుగు వర్గాలకు చేరువైన విజయ్, ఇప్పుడు అదే ప్రజాబలంతో అసెంబ్లీ దిశగా అడుగులు వేశారు. సినిమా గ్లామర్ నుండి రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టిన ఆయన పయనం, అంత సులభంగా సాగలేదు. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. అవమానాలు చవిచూశారు. అయినా అనుకున్నది సాధించడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన విజయ్ ప్రయాణం - యువతకు ఒక ఆశాకిరణం. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.


విజయ్ సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్. ప్రముఖ తమిళ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత. తల్లి శోభన చంద్రశేఖర్. నేపథ్య గాయని, నిర్మాత. విజయ్ చిన్నతనంలో చాలా చురుగ్గా ఉండేవారు. ఆయన చెల్లెలు విద్యా రెండేళ్ల వయసులోనే మరణించడం విజయ్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ సంఘటన తర్వాతే ఆయన చాలా నిశ్శబ్దంగా, గంభీరంగా మారిపోయారని ఆయన తండ్రి పలు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. విజయ్ తన విద్యాభ్యాసాన్ని చెన్నైలోనే పూర్తి చేశారు. ప్రాథమిక విద్యను విరుగంబాక్కంలో, ఆ తర్వాత అడయార్‌లోని లయోలా కళాశాలలో చేరారు. ఉన్నత చదువు కోసం లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ కోర్సులో చేరారు. అయితే, నటనపై ఉన్న ఆసక్తితో చదువు మధ్యలోనే ఆపివేసి, వెండితెరపై ప్రయత్నాలు కొనసాగించారు.

అవమానాలతో మొదలై...

ఒక స్టార్ డైరెక్టర్ కొడుకుగా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ, విజయ్‌ తన సొంత గుర్తింపు కోసం ఆయన పడ్డ శ్రమ సామాన్యమైనది కాదు.

తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ దర్శకత్వంలో 'నాళైయ తీర్పు' (1992) చిత్రంతో విజయ్ కథానాయకుడిగా పరిచయమయ్యారు. అయితే, ఆ సినిమా విడుదలైన తర్వాత ఒక ప్రముఖ తమిళ పత్రిక ఆయన రూపంపై, నటనపై అత్యంత దారుణమైన విమర్శలు చేసింది. ‘‘ఇలాంటి ముఖం ఉన్న వ్యక్తి కూడా హీరోనా?’’ అని ఎగతాళి చేస్తూ రాసిన వ్యాఖ్యలు ఒక 18 ఏళ్ల యువకుడి మనసును తీవ్రంగా గాయపరిచాయి. కానీ, ఆ అవమానాలనే విజయ్ తన విజయానికి ఇంధనంగా మార్చుకున్నారు. తనపై వచ్చిన విమర్శలను స్వీకరించి, తన ఆహార్యాన్ని, నటనను మార్చుకోవడంపై దృష్టి పెట్టారు. కేవలం నటనతోనే కాకుండా, తన అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్, ఫైట్స్‌తో యువతకు దగ్గరయ్యే మెళకువలను ఒంటబట్టించుకున్నారు.

ఫ్యామిలీ ఆడియన్స్‌‌కు దగ్గర

విజయ్ కెరీర్‌ను మలుపు తిప్పిన తొలి చిత్రం 'పూవే ఉనక్కాగ' (1996). విమర్శకులు సైతం మెచ్చేలా ఆయన నటన, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆయనకు దగ్గర చేసింది. అక్కడి నుండి విజయ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కేవలం లవర్ బాయ్ ఇమేజ్‌కే పరిమితం కాకుండా, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఆయన ఎంచుకున్న సినిమాలు ‘కాదలుక్కు మరియాదై’, ‘ఖుషి’. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా, విజయ్‌ను ఒక యూత్ ఐకాన్‌గా నిలబెట్టాయి. వీటిలో ఆయన మేనరిజమ్స్, తెరపై ఆయన చూపించే ఎనర్జీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

వరుస విజయాలు

యాక్షన్ హీరోగా విజయ్ రేంజ్‌ను శిఖరాగ్రానికి చేర్చిన సినిమా 'గిల్లి' (2004). ఈ సినిమాతో ఆయన మాస్ పల్స్ పట్టుకున్నారు. కమర్షియల్ సినిమాల్లో వరుస విజయాలతో కోలీవుడ్ బాక్సాఫీస్ చక్రవర్తిగా ఎదిగారు. మధ్యలో కొన్ని అపజయాలు ఎదురైనప్పటికీ, ఏమాత్రం కుంగిపోకుండా తన నటనలో పరిణతిని పెంచుకుంటూ వచ్చారు. ఆ క్రమంలో వచ్చిన 'తుపాకీ' (2012) ఆయన కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. స్టైలిష్ మేకింగ్, ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ చిత్రం విజయ్‌లోని సరికొత్త నటుడిని ఆవిష్కరించింది. కేవలం తన అభిమానుల కోసమే కాకుండా, సమాజంలోని సమస్యలను ప్రశ్నించే పాత్రలను ఎంచుకుంటూ 'కత్తి', 'మెర్సల్', 'సర్కార్' వంటి చిత్రాలతో తనకంటూ ఒక బలమైన పొలిటికల్ ఇమేజ్‌ను కూడా నిర్మించుకున్నారు. 'విజిల్' (తమిళంలో 'బిగిల్' - 2019) ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను అబ్బురపరిచారు. ఫుట్‌బాల్ క్రీడ నేపథ్యంలో సాగే ఈ కథలో, మహిళా సాధికారతను చాటిచెబుతూ విజయ్ చెప్పిన డైలాగ్‌ ‌లు ఆ దిశగా ఆయన పాత్ర పోషించిన తీరు సామాన్య ప్రజానీకానికి బాగా కనెక్ట్ అయ్యింది. ఇలా గత మూడు దశాబ్దాలుగా విజయ్ తన డ్యాన్స్, నటనతో కోట్లాది మంది అభిమానులను రంజింపజేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఒక నాయకుడిగా ప్రజా సమస్యలను పరిష్కరించి వారి జీవితాల్లో సంతోషాన్ని (రంజితం) నింపుతారని ఆశిద్దాం.


అసలు పేరు: జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్.
పుట్టిన తేదీ :1974, జూన్ 22న
నివాసం: చెన్నై (అప్పటి మద్రాసు)

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్