ఓస్లో (నార్వే): భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద అంతర్జాతీయ చెస్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించాడు.’నార్వే చెస్ 2026′ టైటిల్‌ను గెలుచుకుని సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్ ఆటగాడిగా ప్రజ్ఞానంద నిలిచాడు. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ రౌండ్ లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌ను ఓడించడం ద్వారా ప్రజ్ఞానంద ఈ చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నాడు.
ఈ టోర్నమెంట్‌లో ప్రజ్ఞానంద సాధించిన విజయం ఒక అద్భుతమనే చెప్పాలి. టోర్నీ మధ్యలో వరుసగా రెండు క్లాసికల్ గేమ్‌లలో ఓడిపోయిన ప్రజ్ఞానంద.. ఒక దశలో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోయాడు. లీడర్ కంటే 5.5 పాయింట్లు వెనుకబడ్డాడు. ఇక టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడనుకున్న తరుణంలో.. అసాధారణమైన పోరాట పటిమను కనబరిచాడు. వరుసగా నాలుగు క్లాసికల్ గేమ్‌లలో వరుస విజయాలు సాధించి టోర్నీని మలుపు తిప్పాడు. ఈ క్రమంలోనే ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సన్, ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్‌లను సైతం ప్రజ్ఞానంద ఓడించడం విశేషం. మరోవైపు టేబుల్ లీడర్ వెస్లీ సో, అలీరెజా ఫిరూజ్జాతో జరిగిన క్లాసికల్ గేమ్‌ను డ్రా చేసుకోవడం ప్రజ్ఞానందకు కలిసి వచ్చింది. దీనితో ప్రజ్ఞానంద మొత్తం 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని ముద్దాడాడు. వెస్లీ సో 17 పాయింట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
“రెండు గేమ్‌లు వరుసగా ఓడిపోయినప్పుడు నేను టైటిల్ గురించి అస్సలు ఆలోచించలేదు. కేవలం నా సహజసిద్ధమైన ఆటను ఆడాలనుకున్నాను, అంతే!” — ఆర్. ప్రజ్ఞానంద








కామెంట్‌లు (0)