అబ్బుర పరచిన లేజర్ షో
మెక్సికో సిటీ: ఫుట్‌బాల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ గురువారం అర్ధరాత్రి మెక్సికో నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ షకీరా చేసిన డాన్స్ లతో మెక్సికో సిటీలోని 'ఎస్టాడియో అజ్టెకా' స్టేడియం ఉర్రూతలూగింది. ప్రారంభోత్సవ వేడుకలకు గ్లోబల్ పాప్ ఐకాన్ షకీరా ప్రధాన ఆకర్షణగా నిలువగా... ఆమెతో పాటు గ్రామీ అవార్డు గ్రహీత, నైజీరియన్ అఫ్రోబీట్స్ సెన్సేషన్ బర్నా బాయ్, టోర్నమెంట్ అధికారిక గీతం 'డై డై'ను ఆలపించారు. అలాగే అంతర్జాతీయ స్థాయి కళాకారులు జే బాల్విన్, బెలిండా, డానీ ఓషన్, లీలా డౌన్స్, మనా పాడిన పాటలు అభిమానులను మంత్రముగ్దుల్ని చేశాయి. తొలి మ్యాచ్ ప్రారంభా నికి ముందు అలెజాండ్రో ఫెర్నాండెజ్ మెక్సికన్ జాతీయ గీతాన్ని, టైలా దక్షిణాఫ్రికా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఫిఫా వరల్డ్ కప్ 2026 అంబాసిడర్ హాలీవుడ్ స్టార్ సల్మా హయెక్ పినాల్ట్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. దాదాపు గంటన్నర సేపు సాగిన ప్రారంభోత్సవ వేడుకల్లో లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెక్సికో సిటీలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకలు ఫుట్‌బాల్ చరిత్రలో ఒక అరుదైన ఘట్టంగా నిలిచి పోయాయి. 1970, 1986 ప్రపంచకప్‌లతో పాటు తాజా 2026 వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక మైదానం 'ఎస్టాడియో అజ్టెకా'లో ఈ వేడుకలు జరిగాయి. మిలన్ కోర్టినా వింటర్ ఒలింపిక్స్‌కు క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన మార్కో బాలిచ్ ఈ వేడుకలకు దర్శకత్వం వహించారు. 23వ ఫిఫా ప్రపంచకప్ కు మెక్సికో, కెనడా, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం క్రమంలో మిగిలిన రెండు దేశాల్లోనూ ఆరంభ వేడుకలు జరగనున్నాయి. మెక్సికో వేడుకల అనంతరం కెనడా, అమెరికాలో కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి.
కెనడాలోని టొరంటో స్టేడియంలో శుక్రవారం రాత్రి 11:00 గంటలకు కెనడియన్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అలనిస్ మోరిసెట్ కెనడియన్ జాతీయ గీతాన్ని, అలెక్సాండర్ గాజిక్ బోస్నియా అండ్ హెర్జెగోవినా జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు. నటుడు విల్ ఆర్నెట్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. మైఖేల్ బుబ్లే, అలేస్సియా కారా, జెస్సీ రేయెజ్, ఎలియన్నా, వెగడ్రీమ్, విలియం ప్రిన్స్, సంజయ్, బాలీవుడ్ నటి నోరా ఫతేహి తమ ప్రదర్శనలతో అలరిస్తారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ సో-ఫై స్టేడియంలో శనివారం తెల్లవారుజామున 5:00 గంటలకు ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. మార్కో బాలిచ్ పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమంలో కేటీ పెర్రీ, బ్లాక్‌పింక్ లీసా, రెమా, ఫ్యూచర్, అనిట్ట వంటి గ్లోబల్ స్టార్స్ ప్రదర్శనలు చేయనున్నారు. 12న కెనడా × బోస్నియా అండ్ హెర్డిగోవియా, 13న అమెరికా × పరాగ్వే మ్యాచ్ లకు ముందు ఆతిథ్య దేశాల్లో ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి.
టోర్నీలో ఆడే 48జట్లను 12 గ్రూపులుగా విభజించారు. ప్రతి గూప్ లో 4జట్లు చొప్పున, ప్రతి జట్టు గ్రూప్ దశలో మూడేసి మ్యాచ్ లు ఆడనున్నాయి. ఈనెల 29నుంచి రౌండ్-32, జులై 4నుంచి ప్రి క్వార్టర్స్, 10నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి. జులై 15, 16న సెమీఫైనల్స్, 19న మూడో స్థానానికి, 20న ఫిఫా టైటిల్ సంగ్రామం జరగనుంది.









కామెంట్‌లు (0)