test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇది ఆరంభం మాత్రమే...!

1 రోజు క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 12:54 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌

- హిందూ-ముస్లిం రాజకీయాల వల్ల ఏం సాధించాం? : అభిజిత్‌ ‌

  • దీప్కే ప్రశ్న - భారీగా తరలివచ్చిన యువత

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘ఇది ఒక సుదీర్ఘ పోరాటానికి ఆరంభం మాత్రమే... మా డిమాండ్లు అన్ని నెరవేరేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది.’అని కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) ప్రకటించింది. విద్యా వ్య‌వ‌స్థ‌ నిర్వహణలో పూర్తిగా విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో శనివారం జంతర్‌ ‌మంతర్‌ వద్ద భారీ నిరసన కార్యక్రమం జరిగింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, సిబిఎస్ఇ అవకతవకలు, సియుఇటి, ఎస్ఎస్‌సి, జెఇఇ డేటా లీక్‌ వంటి అంశాలను లేవనెత్తుతూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిజెపి డిమాండ్ చేసింది. ఇంటర్‌‌నెట్‌ ‌వేదికగా ఆవిర్భవించిన తరువాత ప్రత్యక్షంగా సిజెపి నిర్వహించిన ఈ తొలి కార్య్రకమం విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో యువత ఈ ఆందోళనకు తరలివచ్చారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని విశ్వవిద్యాలయాలతో పాటు, పరిసర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువతీ,యువకులు ఈ కార్య్రకమంలో భాగస్వాములయ్యారు. పలు ఇతర రాష్ట్రాలకు చెదిన వారు కూడా పాల్గోనడం కనిపించింది. వీరిలో పలువురు బొద్దింకల మాస్కులు ధరించి కనిపించారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ తరువాత‌ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు వారు సంతాపం తెలుపుతూ, తమ ఫోన్ ఫ్లాష్‌లైట్లను వెలిగించారు. ఉదయం నుండే ఆందోళన కారుల రాక ప్రారంభం కాగా, మద్యాహ్నానికి కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా జంతర్‌‌మంతర్‌‌తో పాటు, ఢిల్లీ నగరమంతా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఉదయం 7.35 గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో దిగిన తరువాత పోలస్‌‌స్టేషన్‌‌కు వెళ్లి ఆందోళనకు అనుమతి తీసుకోవాలని అభిజీత్ దీప్కే తొలుత భావించారు. అయితే, అంతకుముందే ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆయన 11 గంటలకు నేరుగా జంతర్‌‌మంతర్‌‌కు చేరుకున్నారు. అనంతరం ఆందోళన కారుల నుద్దేశించి ఆయన మాట్లాడుతూ 'తమ పిల్లలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే ఏమవుతుందోనన్న భయం ఈ దేశంలోని ప్రతి తల్లికి ఉంది. నా తల్లి , సోదరి కూడా అలాగే భయపడ్డారు. అయితే, భయపడి ఎంతకాలం బతకాలి?' అని అన్నారు. ‘హిందూ-ముస్లిం రాజకీయాల వల్ల దేశంలో ఎవరికైనా ప్రయోజనం కలిగిందా?’ అని ప్రశ్నించారు. గత 10-12 ఏళ్లుగా వాళ్లు మన‌ల్ని హిందూ-ముస్లిం రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఈ రాజకీయాల వల్ల ఇక్కడ ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా?’ అని ఆయన అడిగారు. ‘నిరసనల వల్ల ప్రయోజనం ఏమిటని కొందరు అడుగుతారు. మనం బతికే ఉన్నామనడానికి ఈ నిరసనలే నిదర్శనం. ప్రభుత్వానికి మనం కేవలం పురుగులమే. కానీ మన హక్కుల కోసం పోరాడే సత్తా మనకుంది.’ అని చెప్పారు. ‘ ఈ దేశ యువత ఇకపై భయపడదు. వారు పోరాడతారు. బొద్దింకలు భయపడవు. అవి ఎప్పటికీ చావవు’ అని అభిజిత్ చెప్పారు.

విద్యా వ్యవస్థలో మార్పులు అవసరం : సోనమ్ వాంగ్‌చుక్
ప్రస్తుత విద్యా వ్యవస్థలో మార్పులు అవసరమ‌ని పర్యావ‌ర‌ణ, విద్యా వేత్త‌ సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. సిజెపి ఆందోళ‌న‌కు సంఘీభావం తెలుపుతూ ఆయ‌న‌ మాట్లాడారు. ‘ప్రస్తుత విద్యా వ్యవస్థలలో మార్పులు అవసరం. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి. దీనివల్ల అర్థవంతమైన సంస్కరణలు వస్తాయి. ’ అని చెప్పారు.

విద్యా వ్యవస్థ నిర్వీర్యం : ఐషీఘోష్‌
ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్ మాట్లాడుతూ మతతత్వాన్ని రెచ్చగొట్టి ప్రజలను విభజించడానికి బిజెపి ప్రయత్నిస్తోందని విమ‌ర్శించారు. ‘మోడీ ప్రభుత్వ పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది. గత ఏడేళ్లలో 70కి పైగా ప్రశ్నాపత్రాలు లీక్ అయినా ఇంతవరకు ఎవరూ బాధ్యత తీసుకోలేదు. ఈ ఏడాది ఇంత తీవ్రమైన సమస్య ఉన్నప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఇంకా విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతుండటం శోచనీయం’ అని చెప్పారు. ఈ ఆందోళ‌న‌లో సిపిఐ (ఎంఎల్) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దీపాంక‌ర్ భ‌ట్టాచార్య‌, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అనీ రాజా, జాతీయ కార్యద‌ర్శి కె.రామకృష్ణ‌, ఎస్ఎఫ్ఐ ఢిల్లీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెహినా ఫాతిమా, జెఎన్‌యుఎస్‌యు అధ్య‌క్షురాలు అదితి మిశ్రా, స‌హాయ కార్య‌ద‌ర్శి కె. గోపిక బాబు ప్రభృతులు పాల్గొన్నారు.

నిరసన భగ్నానికి సంఘ పరివార్‌ ‌యత్నాలు
నిరసనను భగ్నం చేయడానికి సంఘ్ పరివార్ అన్ని విధాలా ప్రయత్నించింది. సంఘ్ పరివార్ కార్యకర్తలు నిరసనకారుల వైపు దూసుకెళ్లారు. ఆందోళ‌న ప్రాంతం స‌మీపంలో గంద‌ర‌గోళం సృష్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న ఆరుగురిని ముందు జాగ్ర‌త్త‌గా అదుపులోకి తీసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్