test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అవాక్కు దు:ఖంలోంచీ....

5 రోజుల క్రితం

visakha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 10, 2026, 05:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

వార్షిక లాభాల సభలో
వాటాల మాటలు మాత్రమే వార్తలవుతాయి
వాతలు దేలిన కూలీల వెతలు వినిపించవు...!
తెల్లకాగితాలు గర్వించే ఘాతాంకాలకు
తెగిపోయిన శరీరాంగాల గురించి తెలియజెప్పేవారుండరు....!
రికార్డుల గుడ్డి కనుల్ని
గడ్డ కట్టిన నెత్తురు మరకలు తాకలేవు.....!
పుచ్చుకొనే విరాట్ పురస్కారాలకు
పుర్రె గుర్తు హెచ్చరికలు వర్తించవు....!
నవరత్న హోదాకి
నవ రక్తం ఎక్కించిన దాతల
దారుణ వాస్తవం అక్కర్లేదు......!
l l l
కొలిమితో నిరంతరం చెలిమి చేసే వాడి
కన్నీళ్లు కూడా కొరివి నిప్పుల్లా కారుతుంటాయి
భార్యా పిల్లలకు సైతం భయం గొల్పుతూ ...
నలభై డిగ్రీల సూర్యుడ్ని చూసి
శీతల చూరుకింద దూరిపోతున్నారు.
నల్లగా మారిపోతారని...
రెండు వేల డిగ్రీల వేడికి
రెండు చేతులూ అడ్డుపెట్టుకొని
ఉక్కును ఉడికించే వాడి ఊపిరి తిత్తులకు
బహుశా కత్తుల కవచం ఉంటుందేమో...?
రంగు పూసే చేతులు లేక
తుప్పోడుతున్న ఫైలాన్
చెంగు కప్పుకొన్న అనాథగా
చెప్పుకోలేక వీధుల్లో బిచ్చమెత్తుకోవాలిక ..
నింగిని ముద్దాడే నక్షత్ర భవంతుల్ని
కలగంటున్న కళ్లకు
అర్ధ దేహం కాలిపోయి
మాంస కచ్చికలుగా కదలాడే
దూది ముసుగుల
పచ్చి ఆరని దు:ఖం తెలియాలి ....
రెస్టు లేకుండా రాత్రికి రాత్రి ఎవరెస్టు ఐపోవాలని
క్షణం ఊపిరి సలపనియ్యకుండా
శ్రమ జీవుల ఉసురుని
ఎసరుగా పోసుకొని ఎదుగుతున్న
ఉత్పత్తి నిష్పత్తికిప్పుడైనా కనువిప్పు కలగాలి...
ఇంకెన్ని ప్రాణాలు ఇంకిపోవాలి
ఇనప చూపుల దయకోసం....,?
నాలుగు దశాబ్దాలుగా నాడాలు లేకుండానే
నడుస్తున్న గుర్రానికి అరిగిన కాళ్లకు
ఆయుర్వేద చికిత్స కాదు...
నాలుగు లోహబిళ్లలు కావాలి....!
నువ్వు స్వయంభువుగా కీర్తిస్తూన్న
సింహాచలం అప్పన్నకే ఓ రేడు సరి పోడు
అర్జీత సేవల కోసం నూరు తోటల పూలు
ఆరేడు చేతుల కైంకర్యాలు కావాలి....!
అయిన వాడ్ని గని ముట్టనివ్వకుండా
ఆయువు మట్టు పెడుతున్న వాడు
ఆడని మొనగాడికి కిరీటం పెట్టడం
స్వీయ మరణ శాసనమే ..... కదా...!!

(స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కోసం)
- సుదేరా
సెల్‌: 97013 47080​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్