నిరుద్యోగుల నిప్పులోద్యమం త్యాగ జీవుల చరిత పావనం సాధనకూ.. సంరక్షణకూ ముగింపు లేని ప్రాణ తర్పణం అమ్మా! మా ఉక్కు పరిశ్రమా! అమ్మా! మా హక్కు చిరశ్రమా! అమ్మకాల సంతలో కూర్చోబెట్టి ఒకవైపు, నమ్మకాల భ్రమలలో నాన్చుతున్నారు మరోవైపు! బతుకు యుద్ధ జ్వాలల మధ్య.. ఉద్యోగానికి భద్రత మిధ్య! తేనె పూసిన కత్తులకు-నమ్మించి.. చంపడం తెలిసిన విద్య!.. అమ్మా! గుండె దిటవనూ,కండ బిగువనూ అంచలంచెలుగా కరిగించేస్తే, వణికే చేతులు, వంగిన భుజాలు పెను భారాలను మోయించేస్తే తూలి పడదా, మా అడుగు! తుళ్ళి పడదా, రక్తపు మడుగు!.. అమ్మా! కొట్టుకులాడే కొనప్రాణాలు.. నిస్సహాయుల హాహాకారం! మాటలకందని మహా విషాదం, కన్నుల ముందే లోహాశ్మశానం మూటలు గట్టిన మాంసపు ముద్దలు అధికారం చాటున పరామర్శల పలకరింపులు ఇదేం నివాళి అమ్మా!!
- నల్లి ధర్మారావు
(విశాఖ ఉక్కు అమరులకు వినమ్ర నివాళి)









కామెంట్లు (0)