ట్రంప్ సుంకాలు, ధరల పతనం, వ్యాధులు, మేత రేట్ల మోత, పెట్రో ఛార్జీల పెంపు.. ఆక్వా రైతును ఒకదాని వెంట మరొక సమస్య చుట్టుముట్టి గుక్కతిప్పుకోనీయడంలేదు. మరోవైపు రూ.వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం, పన్ను ఆదాయాలను తమ బొక్కసంలో వేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి, ఇబ్బందులతో సతమతమవుతున్న ఆక్వా రైతులకు ఆదుకోడానికి అస్సలు చేతులు రావట్లేదు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో గణనీయ స్థాయిలో భాగస్వామ్యమవుతున్న చేపల, రొయ్యల రైతులకు ఆపన్నహస్తం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసి సరిపెడుతోంది. తన పరిధిలోని సమస్యల పరిష్కారానిక్కూడా చిత్తశుద్ధి చూపించట్లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ నిర్వాకం ఆక్వా రైతులను అధోగతి పట్టిస్తోంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాగానే మోదిన సుంకాలతో మొట్టమొదట నష్టపోయింది ఎ.పి.లోని రొయ్య రైతులు. మన రొయ్యలపై అమెరికా 60 శాతం వరకు దిగుమతి సుకం బాదింది. ఇక్కడ ధరలు 20-30 శాతం పడిపోయాయి. అమెరికా సుంకాల ప్రభావం మన రాష్ట్రం నుంచి ఏటా జరుగుతున్న రూ.25 వేల కోట్ల విలువైన ఆక్వా ఎగుమతులపై పడింది. సుంకాలు తగ్గించేలా మోడీ ప్రభుత్వం ట్రంప్‌తో చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు ఆందోళనలు చేస్తున్నారు.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం మనగలగడానికి ఆక్సిజన్ ఇస్తున్న టిడిపి గట్టిగా కేంద్రంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకటికి రెండు సార్లు లేఖలు రాయడం తప్ప టిడిపి ప్రభుత్వం చేసిందేమీ లేదు. అంతలోనే ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారం ఏకపక్షంగా ధరలు పెంచేందుకు తెగబడగా రైతాంగం నుంచి తీవ్ర నిరసనలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి తాత్కాలికంగా ఆపించింది. ఫిబ్రవరిలో ఒకసారి ఫీడ్ ధరలను కిలోపై రూ.4 పెంచాయి. కేంద్రం కొన్ని రకాల పన్నులు తగ్గించిన సందర్భంలో కంపెనీలు నామమాత్రంగా ధరలు తగ్గించి, కొన్ని రోజులకే పెంచాయి. తిరిగి కిలోపై రూ.10 వరకు పెంచుతున్నట్లు ప్రకటించి వెనక్కి తగ్గాయి. ఎపి ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ చట్టం ప్రకారం ఫీడ్ ధరలను కంపెనీలు తమకు తాము పెంచడానికి వీల్లేదు. ప్రభుత్వం సమక్షంలో రైతులు, కంపెనీల మధ్య సంప్రదింపులతో జరగాలి. శనివారం సర్కార్ నిర్వహించిన ఉమ్మడి సమావేశంలో కిలోకు రూ.31 వరకు పెంచాలని కంపెనీలు డిమాండ్ చేశాయి. రైతులు ససేమిరా అంగీకరించలేదు. బంతి సిఎం కోర్టుకు చేరింది.
రాష్ట్ర విభజన తర్వాత ఆక్వా, అందులోనూ రొయ్యల సాగు విస్తరణకు టిడిపి, వైసిపి, ప్రస్తుత కూటమి ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికలతో అధిక ప్రాధాన్యమిచ్చాయి. వరి, ఆహార ధాన్యాల కంటే చేపలు, రొయ్యల సాగుతో అధిక ఆదాయం వస్తుందని ఊదరగొట్టాయి. దాంతో రొయ్యల సాగు 4.7 లక్షల ఎకరాలకు విస్తరించింది. అనధికారిక సాగు ఇంకా ఎక్కువే ఉంటుంది. ఆక్వా సాగు రోజు రోజుకూ కాస్ట్లీ అయింది. రైతులు ఆ వైపు మళ్లడంతో గాలివాటుగానూ తయారైంది. వ్యాధులు, ప్రకృతి విపత్తులు తరచు నష్టాలు కలిగిస్తున్నాయి. తరచు ధరల పతనం, అదనంగా ట్రంప్ సుంకాల ప్రభావం, తాజాగా యుద్ధం కారణంగా పెట్రోలు, డీజిల్‌కు కొరత. అంతలోనే వాటి ధరల పెంపు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. కూటమి సర్కార్ తాము ఫీడ్ ధరలు తగ్గించామని, యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే ఇస్తున్నామంటోంది. పెరిగిన ఫీడ్ ధరలతో పోల్చితే ప్రభుత్వం తగ్గించింది చాలా తక్కువ. విద్యుత్ సబ్సిడీకి సైతం పలు ఆంక్షలు అమలవుతున్నాయి. ఆక్వా రైతు శ్రేయస్సు దృష్ట్యా మోడీ సర్కార్ అమెరికాపై ఒత్తిడి తెచ్చి సుంకాలు తగ్గించాలి. ‘పెట్రో’ ఛార్జీలు తగ్గించాలి. అందుకు టిడిపి కూటమి సర్కార్ కేంద్రంపై ఒత్తిడి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని ఫీడ్ ఛార్జీలు సహా ఇతర సమస్యలను పరిష్కరించి ఆక్వారైతులను, ఆ రంగంపై ఆధారపడ్డ లక్షలాది మందిని ఆదుకోవాలి.
అయ్యో... ఆక్వా
19 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 19, 2026, 07:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం








కామెంట్లు (0)