బెరైటీస్ అరుదైన ఖనిజం. స్థానికంగా ప్రజలు దీనిని ముగ్గు రాయి అంటారు. మన దేశంలోని బెరైటీస్ ఖనిజంలో 92 శాతం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో రైల్వే కోడూరు వద్ద నున్న మంగంపేటలోనే లభిస్తుంది. ఈ ఖనిజాన్ని పొడి చేసి 80 శాతం ఉత్పత్తిని పెట్రోలియం, గ్యాస్‌ను తీసే డ్రిల్లింగ్‌లో లూబ్రికేషన్‌గా వాడతారు. ప్రపంచంలోనే పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తిలో బెరైటీస్ కీలకంగా పని చేస్తుంది. మందుల పరిశ్రమలో ఎక్స్‌రే ప్లాస్టర్, ఆయిల్ క్లాత్‌తో సహా అనేక ఉత్పత్తులకు ఉపయోగపడుతుంది. పెయింట్లు, పేపరు, గ్యాసు, రబ్బరు పరిశ్రమల్లో కూడా బెరైటీస్‌ను ఉపయోగిస్తారు. ప్రపంచంలోని బెరైటీస్ లభ్యమయ్యే చైనా, అమెరికా, రష్యా, ఇరాన్ దేశాలు విదేశ ఎగుమతులపై ఆంక్షలు విధించాయి. కాని మన రాష్ట్రంలోని మంగంపేట నుంచి విచ్చలవిడి ఎగుమతుల వల్ల 2015 నాటికి ఉన్న బెరైటీస్ నిల్వలు 49 మిలియన్ టన్నుల నుంచి 2023 నాటికి 23 మిలియన్ టన్నులకు తగ్గిపోయింది.
మన దేశంలో అరుదైన ఖనిజ సంపదల్లో బెరైటీస్ ఒకటి. మన రాష్ట్ర ప్రభుత్వాలు అరుదైన ఖనిజాలను అడ్డగోలుగా ఎగుమతులు చేయడం దేశ ప్రయోజనాలకు హానికరం. ఖనిజం అనేది నూతిలో నీరు లాగా ఊరేది కాదు. అరుదైన ఖనిజాలను విచ్చలవిడిగా ఎగుమతి చేయడం దేశ ద్రోహం. అటువంటి ఖనిజాలను జాగ్రత్తగా నిల్వ ఉంచి దేశ ప్రయోజనాలు కాపాడుకోవాలి. ఆయిల్ డ్రిల్లింగ్ నేడు ఎంతో ప్రాధాన్యతగల రంగం. కేంద్ర ప్రభుత్వ రంగమైన ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జిసి) 2026 మే 26న 2.82 లక్షల ఆర్డర్‌కు బెరైటీస్ పౌడర్ కోసం టెండర్ పిలిచింది. ఈ టెండర్‌ను (టన్ను రూ.11,990కు) కొన్ని కంపెనీలు కలసి అక్రమంగా దక్కించుకున్నాయి. టన్ను పౌడర్ తయారు చేయడానికి అంతా కలిపినా రూ.3,500 కూడా కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎ.పి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఓఎన్జిసి టెండరును ఎందుకు సంపాదించలేకపోయింది? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. 2024 ఎన్నికల్లో గెలిచిన టిడిపి కూటమి గత ప్రభుత్వ అవినీతిపై శ్వేతపత్రాలు ప్రకటించింది. గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడుతూ బెరైటీస్‌తో సహా రాష్ట్రంలో గత ప్రభుత్వం రూ.20 వేల కోట్లకు పైగా అవినీతికి పాల్పడిందని ప్రకటించారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతకంటే ఎక్కువ అవినీతికి పాల్పడింది. ఎ.పి.ఎం.డి.సి చేసిన తప్పుడు మైనింగ్ టెండర్ ఒప్పందాలే దీనికి నిదర్శనం.
బెరైటీస్‌ను పొడి చేసి అమ్ముకునే కంపెనీలకు ఎ.పి.ఎం.డి.సి టన్నుకు రూ.1680 ఖరారు చేసింది. కానీ ఐదు సంవత్సరాల్లో 60 లక్షల టన్నులను విదేశాలకు ఎగుమతి చేయడానికి గాను బల్క్ టెండర్‌ను ఎంప్రద కంపెనీకి మాత్రం టన్నుకు రూ.1188కు చౌకగా కట్టబెట్టింది. అంటే టన్నుకు రూ.492 చొప్పున తగ్గించడం అన్యాయం. దీని వలన రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా రూ.300 కోట్లు నష్టం కలుగుతుంది. ప్రతి సంవత్సరం కనీసం 20 శాతం పెంచినా ఐదు సంవత్సరాల్లో వందలాది కోట్లు ఎ.పి.ఎం.డి.సి కి అదనంగా లాభం వస్తుంది. కానీ నేడు పల్వరైజింగ్ యజమానులు, వారి కార్మికులు దివాళా తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎ.పి.ఎం.డి.సి అవినీతిలో కూరుకుపోయిందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇందువల్లనే బల్క్ టెండర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖనిజ విధానంలో నేడు అనేక తప్పుడు విధానాలు పాటిస్తున్నాయి. ప్రైవేట్ మైనింగ్ మాఫియాను ప్రోత్సహించి, వారికి వేల కోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేయడానికి అవకాశం కల్పిస్తున్నది. ఏ ఖనిజమైనా దేశ అవసరాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. గతంలో గాలి జనార్ధన్‌రెడ్డి రూ.884 కోట్లు విలువ చేసే ఇనుప ఖనిజం బళ్లారి నుండి విదేశాలకు ఎగుమతి చేసి నష్టపరిచారని సుప్రీంకోర్టు 16 సంవత్సరాల తర్వాత తీర్పునిచ్చింది. కానీ విదేశాలకు తరలిపోయిన ఇనుప ఖనిజం తిరిగి వస్తుందా? బెరైటీస్ లాంటి అరుదైన ఖనిజాన్ని 2025 ఫిబ్రవరి 20న కేంద్ర ప్రభుత్వం మైనర్ ఖనిజాల లిస్టు నుండి మేజర్ ఖనిజాల జాబితాకు మార్చింది. కానీ కాంట్రాక్టర్లతో అప్పటి వరకూ ఉన్న టెండర్లు యథావిధిగా కొనసాగించవచ్చని నిర్ణయించింది. అందువలన కేంద్ర ప్రభుత్వ ప్రకటనకు మూడు రోజుల ముందు 2025 ఫిబ్రవరి 17న ఎంప్రద అనే ప్రైవేట్ కంపెనీతో జరిగిన బల్క్ టెండర్ ఒప్పందంపై అనేక అనుమానాలు రేకెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎ.పి.ఎం.డి.సి రెండు సంవత్సరాల్లో 60 లక్షల టన్నుల ఖనిజాన్ని మంగంపేట గనుల నుంచి నేరుగా ఎగుమతి చేయడానికి టెండర్లు ఎందుకు ఇచ్చింది. పెట్రోలియం డ్రిల్లింగ్‌తో సహా మందులు, రబ్బరు, పేపర్, రసాయనాలు అన్ని పరిశ్రమల్లోనూ బెరైటీస్ని పౌడర్‌గానే వాడతారు. పౌడర్ తయారు చేయడానికి మంగంపేటలోనే సుమారుగా 170 కంపెనీలు ఉన్నాయి. వేలాది మంది కార్మికులు అందులో పని చేస్తున్నారు. ఎ.పి.ఎం.డి.సి ఈ ఒప్పందాన్ని అమలు చేయలేకపోతే ఎంప్రద కంపెనీకి ఎ.పి.ఎం.డి.సి 110 శాతం డబ్బు చెల్లించాలని ఒక షరతు విధించింది. మంగంపేట ప్రాంతంలోని అనేక గ్రామాల రైతులు వేలాది ఎకరాల భూములు త్యాగం చేయడం వలనే ఎ.పి.ఎం.డి.సి వేల కోట్ల ధనాన్ని ఆర్జిస్తున్నది. పల్వరైజింగ్ మిల్లుల్లో పని చేసే కార్మికుల పొట్ట కొట్టి ఎంప్రదకు లాభాలు చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దేశ ప్రయోజనాల కోసం వందల సంవత్సరాలు కాపాడుకోవాల్సిన బెరైటీస్ ఖనిజాన్ని తక్కువ కాలంలో ఊడ్చేయడం రాష్ట్రానికి తీరని నష్టం. మంగంపేట ప్రాంతం ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందని సిఐటియు హెచ్చరించింది. బెరైటీస్‌ను విదేశాలకు ఎగుమతి చేసే బల్క్ టెండర్‌ను రద్దు చేయడం రాష్ట్రానికి ప్రయోజనకరం.

- వ్యాసకర్త : సిహెచ్.నరసింగరావు,
సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు








కామెంట్లు (0)