test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏటి బావూ, నలుగుర్ని కనాలా?

6 రోజుల క్రితం

population
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 02, 2026, 05:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఏటి సిఎం బావూ, ఏటి? పొలోమని పిల్లల్ని కనీయండని తెగ పిలుపులిత్తన్నావు? మరోపక్కన పొదుపు పాటించండి అంటన్నావు. టీవీ ఎట్టినా, పోను తిరగేసినా అదే గోస ఇనబడతాంది. అయినా ఇదేవి ఇడ్డూరం!
మూడో వోణ్ని కంటే 30 ఏలిత్తావా? నాలుగో వోణ్ని కంటే 40 ఏలిత్తావా? అది గూడా ఐదేళ్లు? ఏటి పరిపాలన నడిపిత్తన్నావా? పిల్లలమీద ఏలాం పాటగానీ నడిపిత్తన్నావా? ఓ బావూ! మరి మూడో వోడికి, నాలుగో వోడికి నువ్వు డబ్బులిత్తే, మరి ముందున్న ఇద్దరు కూనలు ఏటైపోవాల? ఆలేటి పాపం సేసినారని? ఆల్లని గాలికొదిలేత్తావ్? ఇదేవన్న ఇంగితగానం ఉన్నోల్ల మాట్లేనా అంటన్నా.
అసలు... ఈ మాట సెప్పు.
నీకు పిల్లలంటే గవురం ఉందా? పిల్లలేమీ మాసం ముద్దలు కాదు కదా, కనీసి పడీడానికి. పిల్లలంటే దేశానికి భవిశెత్తు, ఆల్లే కదా రేపటి పెద్దలు. ఆల్ల బతుకు పండాలంటే నాలుగు సిల్లర పైసలు ఇసిరితే సరిపోద్దనుకోడం తప్పుగదా? నేపోతే! ఆల్లు ఎలా పెరిగినా పర్లేదు... జనాబా నెక్క పెరిగితే సాలు అనుకుంతన్నావా?
అసలు ఇప్పుడున్న పిల్లల కంట్లోకి ఏనాడన్న కల్లెట్టి సూసేవా నువ్వు? మా బోటి ఇల్లల్లో పిల్లలు పెశాంతంగా సదుంకునే వాతావరణం ఒకటి ఉందా అంటన్న. పెతీ ఈదికీ మందు కొట్లు, బెల్టుషాపులు ఎట్టించేవు కదా. మరి మా మొగోల్లు తిన్నగ ఇంటికెందు కొత్తారు? పొద్దల్లా ఒల్లొంచి సంపాదించిన పైసలు తిన్నగా పనికాణ్నుంచి మద్యం కొట్టుకు అట్టుకుపోతన్నారు. ఆ డబ్బులు తగలేసి, పీకల దాకా తాగీసి ఇంటికి వత్తన్నారు. పిల్లకాయల సదవులకు డబ్బులిచ్చేదుందా? పెల్లాల మాట ఇనేదేవైనా ఉందా? ఏదీ సిఎం బావూ... ఓ పాలి మా ఈదికి రమ్మి... నువ్వు సూద్దూగానీ... ఎంత మంది మొగోల్లు పిల్లల కష్టం సుకం సూత్తన్నారు? ఎంత మంది పెల్లాలను తన్ని ఆళ్ల కాడ పైసలు లాక్కోని పోతన్నారో సూద్దీగానీ.
ఉన్న పిల్లలకు తిన్నగ సదువులు చెప్పారు. పోనీ బాగా సదుంకున్న పిల్లల కేవన్నా ఉజ్యోగం, సజ్జోగం ఇచ్చేదేవన్నా ఉందా అంటే అదీ లేదు. కుర్రోల్లు ఎలా బతకాలో అర్థం కాక, తల్లిదండ్రులను సూసుకోడానికి సేతిలో సిల్లి గవ్వ లేక బలవంతంగా సచ్చిపోతన్నారు. కొందరు గంజాయని, మందని పనికి మాలిన అలవాట్లు సేసుకొని బతుకు బండలు సేసుకుంతన్నారు. మరి ఆల్ల సంగతి మీకక్కర నేదా?
పోనీ, ఏదో పనిదొరికి అరకొర డబ్బులు సంపాదిత్తన్న కుర్రోళ్ళు పెళ్లి మాటెత్తితేనే బయపడి సత్తన్నారు. పెళ్లి, పిల్లలు, పెల్లాం... కుటుంబం... అంటే పోషణ ఎలాగని బెంగెట్టుకొని పెళ్లికి దూరవైపోతన్నారు. ఇంక ఆల్లు పిల్లల్లేం కంతారు? అయినా... అంతమంది పిల్నల్ని కనీడానికి మన ఆడోళ్లకు ఒంట్లో ఏపాటి రక్తం సుక్కలున్నాయి? సరైన తిండి, పోసన లేని ఆడపిల్లలు రక్తం లేక, తల్లీ బిడ్డలు పురుట్లోనే సచ్చిపోతన్నారు. పిల్లలకు సరిపడ బడులు పెట్టరు, గర్బిణీలకు సరిపడా గోరమెంటు ఆస్పత్రులు పెట్టరు, ఉన్న ఆస్పత్రుల్లో డాకటర్లుండరు, నర్సులుండరు... పిల్లల డాకటర్లుండరు... ఈ ఏవీ సెయ్యని మీరు పిల్లల్ని కనమని సెప్పుతారా, ఇసిత్రం కాకపోతేని!
పిల్లలకింత బువ్వెట్టే అంగన్వాడీ బడులను మొత్తానికే ఎత్తేద్దావని ఏనాటి నుంచో సూత్తన్నారు. అల్లా పెద్దాయన, పంతులేమో ఏకంగా పిల్లల మధ్యానం బడి బువ్వ మీద పడ్డారు. ఆల్లకు గుడ్డెందుకెతన్నారని గుడ్లు ఎర్రజేసి నానా కూతలూ కూసేడు. మరి మీ సదువుల మంత్రి లోకేసు ఒక్క మాటన్నా ఆ పంతుల్ని అడిగేడా? లేదు కదా. మరి మీకెక్కడుంది పిల్లల్ని కనమనే అక్కు?
అయినా ఇప్పుడు పిల్లల్ని కనీడానికి జనాలేవీ అంత తీరిగ్గా నేరుకదా. ఉన్న ఒక్క బిడ్డని పోసించడానికి బతుకు పోరాటంలో అలుపు మరిసి పరుగులు పెడతన్నారు. ఉజ్జోగస్తులు కూడా పిల్లల సదువులకు జీతాలు ఎలా సర్దాలా, ఎక్కడ అప్పులు పుతాయా? అని తంటాలు పడతన్నారు. అయినా అన్నిటికీ పొదుపు మంత్రాలు సెప్పుతున్న మీరు పిల్లలు కనడానికి మాత్రం పొదుపు వద్దంటారా?
అయినా! ఈ మాట సెప్పు బాబు... 100 మందిని కనీసి, పోసించగల డబ్బులు, ఆరోగ్యాలు ఉన్న మీరేమో ఒకల్నే కంతారు. ఒక్కన్నే పోసించలేని మావేమో నలుగురేసి పిల్లల్ని కనీయాలా? ఇదేవి సిత్రవైన పిలుపు!ఎక్కడన్నా నాయం అనీది అందరికీ ఒకనాగే ఉండాలి కదా!
బంగారం కొనకండి పొదుపు సెయ్యండి అంతన్నావు. మామూలు జనాలెక్కడ బంగారం కొనేత్తన్నారు? కూలీ నాలీ సేసి బతికీవోళ్లేమో రేత్రీ పగలూ తేడా నేకండా ‘మందు, గంజాయి’ కొంటన్నారు. మందు కొట్టోల్లకు సెప్పు. రోజికి ఒక గంటసేపే సాపు తెరండి. మిగతా టైమంతా మూసేయండి అని. అప్పుడు జరుగుతాది పొదుపు. అంతేగానీ జనాలందరూ ఎగబడి కొనీది వదిలీసీ, కొనలేని బంగారం కాడ పొదుపు సెయ్యమంతరు. ఇదేవి సిత్రం!
అంచేత నే సెప్పొచ్చేదేటంటే... సిఎం బావూ...
ఆ పిల్లల్ని కనీ పనేదో ముందు మీ నుంచి మొదలెట్టండి. మీ బిడ్డ లోకేసు చేత ముందు నలుగురిని కనిపించు. ఇంకా మీ మంత్రులు, ఎమ్మెల్యేల పిల్లల చేత ఓ పదేసి మందిని కనిపించు. తరవాత జనాలను కనమని సెప్పు. ముందు ఆ పని చూడు...
ఈ ముక్క సెప్పడానికే నేను ఈయాల కూరగాయల గంప పక్కనెట్టి మరీ... మా బడిమేస్టారి చేత నేరుగా నా మాటగా నీకు ఈ ఉత్తరం రాయించేను సిఎం బావూ. నా మాటలన్నీ మనసులో పెట్టుకొని, బాగా ఆలోచించిన తరువాతే ఈసారి మాట్టాడండి మరి!

ఇట్లు
నవస్కారాలతో,
మావిడాకుల మానిక్యం,
కూరగాయలమ్మి,
మూడు లాంతర్లు దరి, ఇజీనగరం.
రచన : ఎల్. శాంతి,
సెల్‌: 76800 86787

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్