నడవటానికి కాళ్ళకు అడ్డం వస్తూ,
అడ్డదిడ్డంగా అల్లుకుపోతూ,
దారుల నిండా ఈ రంగురంగుల తీగలేమిటో!
వాటిని దాటుకుంటూ,
తగలకుండా తప్పించుకుంటూ,
"పదండి ముందుకు" అంటూ,
ముందుకు, ముందుకు
కదలి సాగాలనుకుంటే,
నేనూ నువ్వే కాదు,
బతుకులో గాయాలు తగిలిన ఎందరెందరమో,
దిక్కుతోచక నిలబడిపోతూనే వున్నాం.
ఒక్కసారి, ఒకే ఒక్కసారి,
తీగల చివర్లు దేనికి తగులుకుని ఉన్నాయో,
ఎవరైనా చూడండి బాబూ!
అవి గడకర్రలకు చుట్టి వున్నాయా?
కర్రలకు పైన రంగుల పతాకాలున్నాయా!
అయిదేళ్ళ రుతువుల వరకూ
రెపరెపలాడవు అనుకోడానికి లేదు.
ఎప్పుడు ఏ గాలి వీస్తుందో!
పతాకాలు పైకి లేచాయంటే,
ఈ తీగల రెండో చివర్లన
తగులుకొనివున్న డొంకలన్నీ కదిలి,
గబ్బుకంపుగానీ లేచిందంటే,
నిన్నూ నన్నే కాదు,
వాతావరణాన్నంతట్నీ కమ్మేస్తుందేమో!
కర్రలు పట్టిన చేతులు పైకి లేచినా,
పతాకాలు అహంకారంతో ఎగిరినా,
ఈ తీగలు లాగిన ఈ డొంకలన్నీ
మన కాళ్ళకే కాదు,
బతుకుల్ని కూడా తగులుకున్నాయంటే,
బొక్కబోర్లా పడతామేమో.
భద్రం బాబూ, భద్రం!
- శీలా సుభద్రాదేవి, 8106883099
తీగలు లాగిన డొంకలు
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 08, 2026, 05:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)