test1
ఆదివారం, 14 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎగసిపడే కెరటాలమై...

4 గంటల క్రితం

poetry
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 10:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

"మీ కుటుంబ సభ్యులెవరూ మరణించలేదు కదా!"
అంటే...
​"మీకెందుకు నొప్పీ?
మూసుకొని కూర్చోండీ!" అని కదా మీ ఆదేశం!

మనుషుల మధ్య మానవీయ బంధాల
స్నేహ వారధులు నిర్మించి,
పూల దారుల్ని ఏర్చరచాల్సిన మీరే
ఇంత కుసంస్కారంగా
మనుషుల్ని విడగొట్టే కుట్రకు పూనుకోవడం
ఎంత దారుణం!
​మీ పేంటు జేబుల్లో కుక్కిన బొమ్మలుగా,
మీ పెట్టుబడి బకాసురుల
భోషాణాలు నింపే యంత్రాలుగా,
వాడే పనిముట్లుగా, నడిచే రోబోట్లుగా,
గుండె తడికి దూరంగా మమ్మల్ని
ఎప్పటికీ ఉంచాలని ఆశించడం,
ఉండమని శాసించడం ఎంత దుర్మార్గం!

నదుల్లా పరవళ్లు తొక్కుతూ
ప్రవహిస్తున్న హృదయాల మధ్య
భారీ ఎత్తు గోడలు కట్టి,
బిగదీసి కూర్చోమనడం
ఏ నాగరికతకు కొలమానం?
ఏ మానవీయ విలువలకు తలమానికం?

పదహారు వందల డిగ్రీల
సెల్సియస్ ఉష్ణోగ్రతతో
మరుగుతున్న ఉక్కు ద్రవం
ఒక్కసారిగా మీద పడితే,
ఆ హఠాత్పరిణామాన్ని ఊహించే లోపే
ఎనిమిది నిండుప్రాణాలు
నెత్తుటి ముద్దలుగా మారితే,
మనసు చలించని మనుషులుంటారా?
నిలిచి ప్రశ్నించని పథికులుంటారా?

స్పందించడమే నేరమైనట్టు,
ప్రశ్నించడమే ఘోరమైనట్టు,
అసహనంతో, అహంకారంతో,
శవాల ముందు కనీస మానవ
మర్యాదల్ని కూడా గాలికొదిలేసి
అధికార దర్పాన్ని ప్రదర్శిస్తే...
అలాగే కానివ్వండి, మీ ఇష్టం...!

మా మధ్య గోడలు కడుతూ,
మమ్మల్ని విడగొట్టే పన్నాగాలు
నిరంతరం పన్నుతూనే ఉండండి.
మా భావోద్వేగాల్ని నిత్యం
రెచ్చగొడుతూనే ఉండండి.

కానీ...
​మేం ఎగసిపడే కెరటాలమై ఎప్పటికీ
మీ గోడల్ని బద్దలు కొడుతూనే ఉంటాం!
మీ గుండెల్లో తుపానుల్ని సృష్టిస్తూనే ఉంటాం!

​– పతివాడ నాస్తిక్
94417 24167

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్