test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపొగ… ఆరోగ్యానికి చెద!

01 జూన్, 2026

lungs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 01, 2026, 06:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం


థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు పొగ కారణంగా మంచం పట్టిన ముకేశ్‌ను చూపించినా, క్రికెట్‌ దిగ్గజం రాహుల్‌ ద్రావిడ్‌తో ప్రచారం చేయించినా, ధూమపానం ఆరోగ్యానికి హానికరమని భయంకర ఫోటోలను చూపించినా ధూమపానం చేసే వారిలో మార్పు రావడం లేదు. కొంతమంది యువతకు సిగరెట్‌ తాగడం ఫ్యాషన్‌గా మారింది. పొగతాగడం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కొందరు ఆ మత్తుకు చిత్తయిపోతున్నారు. పొగాకుపై చేసే ప్రతి పైసా వృథానే. దీనికి తోడు రోగం వస్తే ఆస్పత్రులకు డబ్బులు పోయాలి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.


​కేంద్ర ప్రభుత్వం 2003లో పొగాకు ఉత్పత్తుల నిషేధంపై చట్టం చేయగా, బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడాన్ని 2008లో నిషేధించింది. అయినప్పటికీ పొగాకు వినియోగం, ఉత్పత్తుల్లో దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. 15 నుంచి 24 ఏళ్ల మధ్య వారిలో ఎక్కువగా ఈ వ్యసనానికి గురవుతున్నారు. ఏటా 13.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు.
​పొగతాగడం.. ప్రమాదకర వ్యసనం.. ప్రాణాంతకం. సిగరెట్‌ను సరదాగా తాగి, పొగ వదలడంగానే భావించే వ్యసనపరులకు, యువతకు దీంతో వచ్చే భయంకరమైన వ్యాధులపై అవగాహన లేదు. ఊపిరితిత్తులు పాడైపోయి, మోకాళ్ల కింద భాగానికి రక్తం ప్రవహించక నల్లగా మారి చచ్చుపడిపోతాయి. కేన్సర్‌, గుండె జబ్బులు వచ్చే అవకాశముంది. క్రమంగా శరీర అవయవాలన్నీ దెబ్బతింటాయి. పొగాకు వలన ఊపిరితిత్తుల్లో ముప్పువాటిల్లి ఎంఫసియా, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిజార్డర్‌ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. గొంతు కేన్సర్‌, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. పొగాకు వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేయాలి. గుట్కా, పాన్‌పరాగ్‌లు అమ్మడం నిషేధం. గుట్కా, మత్తు పదార్థాల అమ్మకాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి సారించాలి. గుట్కా, పాన్‌ వంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

​బానిసత్వానికి ముగింపు పలుకుదాం

ఏటేటా మే 31న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పొగాకు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది థీమ్‌గా తీసుకున్న నినాదం ‘ఆకర్షణ వెనుక ఉన్న మోసం.. నికోటిన్‌ బానిసత్వానికి ముగింపు పలుకుదాం’. 1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ప్రారంభించింది. పొగాకు వాడకం వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రోత్సాహం ఇవ్వడం దీని ప్రధాన ఉద్దేశం. నేటి సమాజంలో సిగరెట్‌, బీడి, గుట్కా, ఖైనీ, పాన్‌మసాలా వంటి పొగాకు ఉత్పత్తులు యువతను వేగంగా బానిసలుగా మారుస్తున్నాయి. ఆరోగ్యాన్ని నాశనం చేయడమే కాకుండా కుటుంబాల ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తున్నాయి.
​ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 70 లక్షల మందికి పైగా పొగాకు కారణంగా మరణిస్తున్నారు. వీరిలో సుమారు 16 లక్షల మంది ఇతరులు తాగిన పొగ ప్రభావం వల్ల మరణించిన వారే. మనదేశంలో సుమారు 13.5 లక్షల మంది పొగాకు సంబంధిత వ్యాధుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. విజయవాడలోని నవజీవన్‌ బాలభవన్‌ ఆధ్వర్యంలో పొగాకు వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరుతూ గత కొన్నేళ్లుగా అనేక రూపాల్లో ప్రచార కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నాం.
పొగాకు అలవాటును మాన్పించటానికి డీ-అడిక్షన్‌ సెంటర్లను ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక చికిత్స కేంద్రాలుగా నిర్వహిస్తున్నాయి. వీటిలో వైద్య పరీక్షలు, మానసిక కౌన్సెలింగ్‌, కుటుంబ కౌన్సెలింగ్‌, ఫాలో-అప్‌ సేవలు అందిస్తారు. టోల్‌ఫ్రీ సేవలు కూడా అందుబాట్లో ఉనా్్నయి. క్విట్‌ టొబాకో హెల్ప్‌లైన్‌, మొబైల్‌ సందేశాల ద్వారా ప్రోత్సాహం, ఆరోగ్య యాప్‌లు, ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ఈ అలవాటు మానటానికి సహకారం అందిస్తాయి.

lungs 2

పొగాకు వాడకం వల్ల వచ్చే వ్యాధులు

  • నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, నాలుక, పెదవుల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. అలాగే

  • గుండెపోటు, రక్తపోటు, పక్షవాతం ప్రమాదం పెరుగుతుంది.

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగొచ్చు. దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా, సీఓపీడీ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి.
    • పళ్లు పసుపు రంగులో మారడం, దుర్వాసన, దంతాలు బలహీనపడటం, నోటి పుండ్లు వంటివి సంభవిస్తాయి.
    గర్భిణీలు పొగ తాగినా, ఇతరుల తాగే పొగ ప్రభావం పడినా – గర్భస్రావం, తక్కువ బరువుతో శిశువు పుట్టడం, శిశువు ఆరోగ్య సమస్యలు వంటివి రావొచ్చు.

మానసిక, సామాజిక నష్టాలు
• పొగాకు అలవాటు అడిక్షన్గా మారుతుంది
• కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది
• పిల్లలపై చెడు ప్రభావం పడుతుంది
• పని సామర్థ్యం తగ్గుతుంది.

​పొగ తాగని వారు కూడా పొగను పీల్చడం వల్ల
• పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు
• గర్భిణీలకు ప్రమాదం
• ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.


​ఇలా మానేయవచ్చు… – గోళ్ళమూడి శేఖర్ బాబు ప్రోగ్రాం మేనేజర్‌, నవజీవన్‌ బాలభవన్‌, విజయవాడ.
ఒక పొగాకు మానే తేదీ నిర్ణయించుకోవాలి.
పొగాకు వాడే స్నేహితుల నుంచి కొంత దూరంగా ఉండాలి.
ఎక్కువగా నీరు తాగాలి.
చిగురు గమ్‌, పండ్లు తీసుకోవాలి.
కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలి.
మళ్లీ అలవాటు పడితే నిరాశ చెందకుండా తిరిగి ప్రయత్నించాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్