టొరంటో: ఫిఫా ప్రపపంచకప్ కు ఆతిథ్యమిస్తున్న మూడో దేశం కెనడా జరిగిన మరో మ్యాచ్ లో ఆతిథ్య జట్టు బోస్నియాను నిలువరించింది. దీంతో ఇరుజట్ల మధ్య శనివారం జరిగిన మరో మ్యాచ్ డ్రా అయ్యింది. మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే కెనడాకు గోల్ ఖాతా తెరవడానికి సువర్ణావకాశం లభించింది. లూక్ డి ఫౌగెరోల్స్‌కు గోల్ పోస్ట్ సమీపంలో బంతి అందింది. కానీ, అతను గోల్ కొట్టడంలో విఫలమయ్యాడు. ఆ మరుసటి నిమిషంలోనే బోస్నియా కూడా ఎదురుదాడికి దిగింది. లభించిన ఫ్రీ కిక్‌ను గోల్‌గా మార్చడంలో బోస్నియా ఆటగాడు మెమిచ్ తడబడ్డాడు. మ్యాచ్ 10వ నిమిషంలో కెనడాకు గట్టి షాక్ తగిలింది. బోస్నియా ఆటగాడు మెమిచ్‌ను ప్రమాదకరంగా కింద పడేసినందుకు కెనడా డిఫెండర్ అలిస్టైర్ జాన్‌స్టన్‌కు అంపైర్ పసుపు కార్డు చూపించారు. 21వ నిమిషంలో బోస్నియాకు లభించిన కార్నర్ కిక్‌ను ఆ దేశ ఆటగాడు ఇవాన్ బేసిక్ అత్యంత చాకచక్యంగా డి-బాక్స్ లోకి పంపాడు. అక్కడ సిద్ధంగా ఉన్న సీద్ కొలాసినాక్ ఆ బంతిని ఫ్లిక్ చేయగా, కేవలం రెండు గజాల దూరం నుంచి జోవో లుకిచ్ అద్భుతమైన హెడర్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. జోవో లుకిచ్‌కు ఇది అంతర్జాతీయ కెరీర్‌లో ఇదే తొలి గోల్. అలాగే 2014 తర్వాత ప్రపంచకప్‌లో బోస్నియా సాధించిన తొలి గోల్ ఇదే. ఈ గోల్‌తో బోస్నియా 1-0 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బోస్నియా ఖాతాలో గోల్ పడటంతో కెనడా ఒత్తిడిలో పడింది. స్టార్ ఆటగాడు జోనాథన్ డేవిడ్ గోల్ కోసం కొన్ని మంచి అవకాశాలను సృష్టించినప్పటికీ, బోస్నియా డిఫెండర్లు వాటిని తిప్పికొట్టారు. ఇక రెండో అర్ధభాగం ప్రారంభం నుంచే కెనడా జోరు పెంచింది. 53వ నిమిషంలో కెనడాకు మంచి అవకాశం లభించింది. స్టీఫెన్ యుస్టాకియో అందించిన అద్భుతమైన పాస్‌ను రిచీ లార్యా అందుకుని గోల్ కీపర్‌ను దాటించి షాట్ కొట్టాడు. అది గోల్ కావడం ఖాయమనుకున్న సమయంలో, బోస్నియా డిఫెండర్ కొలాసినాక్ అద్భుతమైన రీతుల్లో గాల్లోకి లేచి బంతిని నెట్టి గోల్ కాకుండా కాపాడాడు. టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఓటమి ఖాయమనిపిస్తున్న తరుణంలో కెనడా కోచ్ జెస్సీ మార్ష్ ఒక కీలక మార్పు చేశారు. 76వ నిమిషంలో బెంచ్‌పై ఉన్న స్టార్ స్ట్రైకర్ కైల్ లారిన్‌ను మైదానంలోకి దించారు. కోచ్ నమ్మకాన్ని లారిన్ వమ్ము చేయలేదు. మైదానంలోకి వచ్చిన కేవలం మూడు నిమిషాల్లోనే ప్రామిస్ డేవిడ్ అందించిన పాస్‌ను లారిన్ అందుకున్నాడు. ఒక క్విక్ టర్న్‌తో బంతిని నెట్‌లోకి పంపాడు. ఈ గోల్‌తో స్టేడియంలోని కెనడా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్కోరు 1-1 తో సమమైంది. ఆ తర్వాత లారిన్ మరో గోల్ ప్రయత్నం చేసినప్పటికీ బోస్నియా డిఫెండర్ తారిక్ ముహారెమోవిచ్ అడ్డుకోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
పరాగ్వేపై అమెరికా గెలుపు
ఇంగిల్ వుడ్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆతిథ్య అమెరికా తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. గ్రూప్-డిలో పరాగ్వేతో శనివారం జరిగిన మ్యాచ్‌లో అమెరికా 4-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. తొలి అర్ధభాగంలోనే అమెరికా మూడు గోల్స్ చేసింది. దక్షిణ కాలిఫోర్నియాలో జరిగిన ఈ మ్యాచ్‌లో మ్యాచ్ ప్రారంభం నుంచి అమెరికా జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి అర్ధభాగంలోనే అమెరికా మూడు గోల్స్ చేయడం.. చరిత్రలో ఇదే తొలిసారి. ఇందులో ఫ్లోరియన్ బలోగన్ రెండు గోల్స్ చేశాడు. ఇక రెండో అర్ధభాగంలో జియో రేనా మరో గోల్ చేశాడు. దీంతో ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అమెరికా మొత్తం నాలుగు గోల్స్ చేయడం ఇదే తొలిసారి. అమెరికా జట్టులో డీ బోడాడిల్లా 7వ నిమిషంలో, ఆ తర్వాత బలోగన్ 31, 45వ నిమిషాల్లో, రేనా 90వ నిమిషంలో గోల్స్ చేశారు. ఖతార్‌లో జరిగిన గత వరల్డ్‌కప్‌లో నాలుగు మ్యాచుల్లో అమెరికా కేవలం మూడు గోల్స్ మాత్రమే చేసింది. ఇప్పటి వరకు ఏ వరల్డ్‌కప్ మ్యాచ్‌లోనైనా మూడు కన్నా ఎక్కువ గోల్స్ ఆ దేశం చేయలేదు. సుమారు 70 వేల మంది ప్రేక్షకులు ఉన్న స్టేడియంలో అమెరికా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పరాగ్వే తరపున రెండో భాగంలో మౌరీసియో ఓ గోల్ స్కోరు చేశాడు. ఆ గోల్ ను 73వ నిమిషంలో చేశాడు.
ఫిఫా ప్రపంచ కప్ 2026 గ్రూప్-బీ ప్రారంభ మ్యాచ్ ఫుట్‌బాల్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపింది. టొరంటోలోని బీఎమ్‌ఓ స్టేడియం వేదికగా జరిగిన పోరులో సహ ఆతిథ్య దేశమైన కెనడా, బోస్నియా-హెర్జెగోవినా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1 గోల్స్‌తో డ్రాగా ముగిసింది. మ్యాచ్ చివరి వరకు బోస్నియా ఆధిక్యంలో ఉంది. అందరూ ఆ జట్టే గెలుస్తుందని అనుకున్నారు. కానీ, చివరి నిమిషాల్లో కెనడా స్టార్ స్ట్రైకర్ కైల్ లారిన్ సబ్‌స్ట్యూట్‌గా వచ్చి అద్భుతమైన గోల్ చేశాడు. దీంతో జట్టును పరాజయం నుంచి రక్షించాడు. దీంతో ఈ టోర్నీలో ఇరు జట్లు చెరో పాయింట్‌తో తమ ఖాతాలను తెరిచాయి. ఇదిలా ఉండగా, అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో కెనడా ఇప్పటివరకు ఆడిన ఏడు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఒక్క దాంట్లో కూడా గెలవకపోవడం గమనార్హం.
ఫిఫా ప్రపంచకప్ లో నేడు…
14(ఆది) : హైతీ × స్కాట్లాండ్ ఉ.6.30గం||లకు
ఆస్ట్రియా × టర్కీ ఉ.9.30గం||లకు
జర్మనీ × కురాకో రా.10.30గం||లకు
15(సోమ):నెదర్లాండ్స్ × జపాన్ తె.1.30గం||కు
ఐవరీ కోస్ట్ × ఈక్వెడార్ తె.4.30గం||లకు









కామెంట్‌లు (0)