test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టోకు ధరల జోరు

3 గంటల క్రితం

busines
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 16, 2026, 12:34 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఇంధనం, ఆహార ఉత్పత్తులు భారం

న్యూఢిల్లీ : దేశంలో టోకు ధరలు భారీగా పెరిగాయి. ఇంధనం, విద్యుత్ రంగాల ఉత్పత్తులు భారం కావడంతో ఈఏడాది మేలో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యుపిఐ) ఏకంగా 9.68 శాతానికి ఎగిసింది. ఇది ఏప్రిల్‌లో 8.3 శాతంగా నమోదయ్యింది. సోమవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ముడిచమురు ధరలు అధికంగా ఉండటం, ఇంధన, ఆహార వస్తువులు, కొన్ని రకాల తయారీ ఉత్పత్తుల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఇంధన విభాగంలో ద్రవ్యోల్బణం అంతకుముందు నెలలోని 24.71 శాతం నుండి మే నాటికి 30.33 శాతానికి ఎగిసింది. ఈ విభాగంలో ముడి పెట్రోలియం, సహజ వాయువు ద్రవ్యోల్బణం ఏకంగా 61.51 శాతానికి చేరింది. ముడి పెట్రోలియం, సహజ వాయువు, ఖనిజ నూనెలు, రసాయనాలు, ప్రాథమిక లోహాల ధరల పెరుగుదల వల్ల వివిధ రంగాలలో ఉత్పత్తి వ్యయం పెరిగి తయారీదారులపై అదనపు భారం పడిందని ప్రభుత్వం తెలిపింది.

​ పెరిగిన తయారీ రంగాల ధరలు
​టోకు ఆహార సూచీ ప్రకారం.. ఏప్రిల్‌లో 3.11 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం మే నెలలో 4.49 శాతానికి పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగడంతో ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం 3.78 శాతం నుండి 4.99 శాతానికి చేరింది. ఇదే సమయంలో తయారీ రంగ ద్రవ్యోల్బణం కూడా ఏప్రిల్‌లోని 6.68 శాతం నుండి మే నెలలో 7.48 శాతానికి పెరిగింది. మే నెల టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు సవరించిన సరికొత్త డబ్ల్యుపిఐ సిరీస్ కింద విడుదలయ్యాయి. పాత ఆధారిత ఏడాది 2011-12 స్థానంలో.. ఇప్పుడు 2022-23ను కొత్త బేస్ ఇయర్‌గా ప్రభుత్వం ఖరారు చేసింది. నూతన బాస్కెట్‌లో వస్తువుల సంఖ్యను గతంలో ఉన్న 697 నుండి 957 కి పెంచారు. ఇందులో తొలిసారిగా సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులతో పాటు అణు విద్యుత్‌ను కూడా చేర్చారు. ఇంధన ధరల హెచ్చుతగ్గులను మరింత స్పష్టంగా అంచనా వేసేందుకు వీలుగా.. ముడి పెట్రోలియం, సహజ వాయువును ప్రాథమిక వస్తువుల కేటగిరీ నుండి ఇంధనం, విద్యుత్ కేటగిరీకి మార్చారు. అంతర్జాతీయ ద్రవ్య నిధిసంస్థ (ఐఎంఎఫ్‌) సిఫార్సుల మేరకు రాబోయే ఐదేళ్ల పాటు పిపిఐలతో పాటే డబ్ల్యుపిఐ గణాంకాలను కూడా ప్రచురిస్తామని డిపిఐఐటి తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్