హైదరాబాద్ : ‘ రైట్ యాటిట్యూడ్ ఉన్నోడిని ఎవరూ ఓడించలేరు ` అని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘ స్ఫూర్తినిచ్చే మాట అన్నారు. పూరి మ్యూజింగ్స్’ పేరుతో ఆయన ఆసక్తికర విషయాలు పంచుకుంటున్న విషయం విదితమే. తాజా ఎపిసోడ్‌లో యాటిట్యూడ్ గురించి మాట్లాడారు. రైట్ యాటిట్యూడ్ ఉన్నోడిని ఎవరూ ఓడించలేరంటూ స్ఫూర్తి నింపే మాటలు చెప్పారు.
‘‘నీ యాటిట్యూడ్ వల్ల నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోదు. కానీ, నీలోని ప్రపంచం మారుతుంది. ఒక పెను తుపానులో రెండు ఇళ్లు సముద్రంలో కొట్టుకుపోయాయి. అన్నీ కోల్పోయి ఒకడు ఏడుస్తుంటే.. ఇంకొకడు ఏదో చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతూ నవ్వుతూ కనిపిస్తాడు. ఒకడు కుంగిపోతాడు. మరొకడు బతికాననుకుంటాడు. మీకు నెగెటివ్ మైండ్ ఉంటే దీవెనలు కూడా దరిద్రంగా అనిపిస్తాయి. అదే మీరు కాన్షియస్ మైండ్ (స్పృహతో ఉన్న మనసు)తో ఉంటే కష్టాలు కూడా అవకాశాల్లా కనిపిస్తాయి. ప్రపంచంలో ఏదీ నీకు మాత్రమే వ్యతిరేకంగా జరగదు. ప్రపంచంలో ఏవేవో జరుగుతుంటాయి. అందులో నువ్వు కూడా ఉన్నావంతే. అలాంటప్పుడే మన యాటిట్యూడ్ సాయం చేస్తుంది. ఆ తుపానులో నువ్వు బాధ పడతావా ? అనుభూతి చెందుతావా ? అన్నది నీ ఇష్టం. ప్రతి దానికీ కంప్లైంట్ చేసుకుంటూ పోతే నీకే నష్టం. ఎప్పుడూ ఏడుస్తూ బతకాలి అని అనుకున్న వారికి చుట్టూ వేల కారణాలు కనిపిస్తాయి. బయట జరిగేదేదీ మన చేతిలో ఉండదు. కానీ, దానిపై ఎలా స్పందించాలనేది మాత్రం మన చేతిలోనే ఉంటుంది. రైట్ యాటిట్యూడ్ ఉన్నోడిని ఎవరూ ఓడించలేరు. ఎందుకంటే వాడు జీవితానికి ఎదురెళ్లడు. జీవితమనే నదిలో ఒదిగిపోతూ కొట్టుకుపోతున్నాడు. వాడిని ఎవరూ ఏమీ చేయలేరు. వర్షంలో తడవాల్సి వస్తే తడువు. ఎండలో ఉండాల్సి వస్తే ఉండిపో. అప్పుడే నీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి దానికీ భయపడే లక్షణం ఉంటే నెమ్మదిగా మార్చుకోండి. భయపడకపోతే ఇదే జీవితంలో మీ అనుభవం మరోలా ఉంటుంది. ఇక్కడ ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు. మన క్యారెక్టర్ ఎలా ఉన్నా ఫర్వాలేదు. ఒరిజినల్‌గా ఉంటే చాలు. ఎవరి కోసమూ యాక్ట్ చేయాల్సిన పనిలేదు. మీ కాన్ఫిడెన్స్ లెవల్ మీ సింప్లిసిటీలో అర్థమవుతుంది. మన కష్టాలన్నింటినీ తట్టుకోవాలన్నా.. పడి లేవాలన్నా.. పరిగెత్తాలన్నా మనకు కావాల్సింది యాటిట్యూడ్’’ అని పూరిజగన్నాథ్ చెప్పారు.









కామెంట్‌లు (0)