'ఆటనుకోకొయ్... ఆటంటే బతుకోయ్..
నీ ఆట బతకాలిరోయ్..
మాటనుకోకొయ్... గెలుపంటే వెలుగోయ్...
గెలుపై నువ్వు వెలగాలిరోయ్... మండే గుండె నీలో లేదంటే...' అంటూ సాగే పాట జూన్ 4న విడుదలకాబోయే ‘పెద్ది’ సినిమాలోది.
‘ఒకటే జననం, ఒకటే మరణం.. గెలుపు పొందే వరకూ అలుపు లేదు మనకు...
బ్రతుకే లాంటి గెలుపూ... గెలుపు కొరకే బ్రతుకు’ అంటూ సాగే పాట ‘భద్రాచలం’ సినిమాలోనిది.
‘కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి... ఆడితే ఆడాలిరా రప్పాడించాలి...
పోటీ ఏదైనా గానీ గెలుపొందితీరాలి’ అంటూ సాగే పాట ‘ఠాగూర్’ సినిమాలోనిది.
.... ఇలా చెప్పుకుంటూ పోతే, సినిమాల్లో అనేక ఆటల గొప్పతనాన్ని సాహిత్య ప్రక్రియల ద్వారా చక్కగా ఆవిష్కరించారు. ఇటీవల వచ్చిన ‘బైకర్’లోనూ క్రీడల ప్రస్తావన కనిపించింది.
ఓడటం తెలిసినవాడే గెలవడం నేర్చుకుంటాడు. ఆటల్లో ఉంటేనే ఓటమి, గెలుపు, ఓడినా గెలిచినా సాధన కొనసాగించడం తెలుస్తాయి. మనిషిని మానసికంగా, శారీరకంగా తీర్చిదిద్దడంలో ఆటను మించింది లేదు. ఆటలో ఉండే ఉద్వేగం, ఉత్కంఠ కూడా మనిషిని బలంగా ఆకర్షిస్తాయి. క్రీడా నేపథ్య చిత్రాలు తెలుగు తెరకు కొత్త కాదు. మనందరికీ బాగా తెలిసిన క్రికెట్ మొదలుకొని, పెద్దగా పరిచయం లేని రగ్బీ వరకు పలు భిన్నమైన స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్షకులను పలకరించాయి. వాటిలో సింహభాగం విజయాలను సొంతం చేసుకున్నాయి. కానీ, ఒకే సినిమాలో పలు భిన్నమైన క్రీడలను స్పృశిస్తూ ముస్తాబైన క్రీడా నేపథ్య చిత్రాలు మాత్రం అరుదనే చెప్పాలి. ఇప్పుడా లోటును ‘పెద్ది’తో తీర్చబోతున్నారు కథానాయకుడు రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సాన. ‘ఉప్పెన’ విజయం తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రమిది. క్రికెట్, కుస్తీ, రన్నింగ్ లాంటి ఆటలతో ముడిపడిన ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని సిద్ధం చేశారు. ఉత్తరాంధ్ర నేపథ్యంగా సాగే ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ ఆటకూలీగా అందర్నీ ఆశ్చర్యపరచనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు, అందులో చరణ్ ఆడిన క్రికెట్ షాట్లు విశేష ఆదరణ దక్కించుకున్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్‌చరణ్ క్రికెటర్‌గానూ, కుస్తీ యోధుడిగానూ కనిపిస్తారు. అచ్చం ఉత్తరాంధ్ర కళింగ యాసలో ఈ సినిమా పూర్తిగా సాగనుంది.
సినిమాలో ఆట అనేది కేవలం ఆటకే పరిమితం కాదు; అది జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం, దేశభక్తిని చాటిచెప్పడం వంటి అంశాలతో ముడిపడి సాగింది. వెండితెరపై ఆటస్థలాన్ని కూడా ప్రధానంగా చూపించిన తెలుగు సినిమాల గురించి తెలుసుకుందాం.
శోభన్‌బాబు నటించిన ‘మంచి మనుషులు’లో స్కేటింగ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ‘గంగ–మంగ’ సినిమాలో శోభన్‌బాబు, వాణిశ్రీ ‘గాలిలో పైరగాలిలో’ పాటలో స్కేటింగ్ చేస్తారు. ‘గండికోట రహస్యం’ సినిమాలో ఎన్.టి.ఆర్ కబడ్డీ ఆడటం, ‘యుగపురుషుడు’లో కరాటే చేయడం తప్ప ఆ కాలంలో ఆటల ప్రస్తావన పెద్దగా కనిపించలేదు. చిరంజీవి ‘ఇంటిగుట్టు’లో నళినితో కలిసి మిక్స్‌డ్ కబడ్డీ ఆడారు. ఆ తర్వాత ‘విజేత’లో ఫుట్‌బాల్ గోల్‌కీపర్‌గా కనిపించారు.
జాతీయ స్థాయిలో పరుగుల రాణిగా నిలిచిన అశ్విని నాచప్ప జీవితం 1991లో తెలుగులో ‘అశ్విని’గా తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’, పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘అమ్మా నాన్న తమిళ అమ్మాయి’ సినిమాలు కూడా కిక్‌బాక్సింగ్ నేపథ్యంలో సాగాయి. 2003లో వచ్చిన మహేష్‌బాబు ‘ఒక్కడు’ సినిమాలో కబడ్డీ ప్లేయర్‌గా కనిపిస్తారు. దీనికి కొద్దిగా ముందు వచ్చిన శ్రీహరి ‘భద్రాచలం’ తైక్వాండోను కథగా తీసుకుంది. ‘బీమిలి కబడ్డీ జట్టు’ (కబడ్డీ), ‘గోల్కొండ హైస్కూల్’ (క్రికెట్), ప్రకాష్‌రాజ్ ‘ధోని’ (క్రికెట్), ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ (అథ్లెటిక్స్), ‘సై’ (రగ్బీ)... ఇలా పలు చిత్రాలు ఆటలను ప్రధానాంశంగా తీసుకుని ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ‘జెర్సీ’, ‘మజిలీ’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలు ప్రేక్షకులను గ్రౌండ్స్‌లోకి తీసుకెళ్లాయి. ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ హాకీని ప్రధానంగా చూపించింది. ‘గురు’ మహిళా బాక్సింగ్‌ను, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ మహిళా క్రికెట్‌ను ప్రధానంగా తీసుకుని విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తమిళ హీరో విజయ్ నటించిన ‘విజిల్’ మహిళా ఫుట్‌బాల్‌ను సరికొత్తగా ఆవిష్కరించింది. ‘లైగర్’ బాక్సింగ్‌తో, ‘లక్ష్య’ విలువిద్యతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.









కామెంట్‌లు (0)