కర్నూలు : ఒకప్పుడు మంచి క్రేజ్ ఉన్న గోలి సోడా నూతన టెక్నాలజీతో తయారు చేసిన యంత్రాలు రావడంతో కనుమరుగవుతుంది. కర్నూల్ నగరంలో వందలాదిగా గోలి సోడా షాపులు నేడు కనుమరుగై పదుల సంఖ్యలో కూడా లేకపోవడం గమనార్హం. ఒకప్పుడు నలుపు తెలుపు సినిమాలో ఉన్న సందర్భంలో గోలి సోడా పై కవులు పాటలు కూడా రాయడం జరిగింది. “సోడా సోడా గోలిసోడా, సోడా తాగారా తెలుగోడా ఆంధ్రా సోడా” అంటూ పాటలు పాడడం జరిగింది.
20 ఏళ్ల క్రితం గోలీ సోడా ..!
20 సంవత్సరాల క్రితం గోలి సోడా ఒక రూపాయి ఉండేది. అది నేడు 10 రూపాయలకు చేరింది. అలాగే నిమ్మకాయ రెండు రూపాయలు ఉండేది 10 రూపాయలు, గ్యాస్ ₹100 లది 500 రూపాయలు, షాక్రీన్ కేజీ 40 రూపాయలది 250 రూపాయలు, నన్నారి వేర్లు కేజీ 150 లు ఉన్నది నేడు 1400 రూపాయలు, ధరలు పెరిగిపోయాయి. అందుచేత నేడు సోడా, లెమన్ పది రూపాయలు, నిమ్మకాయ సోడా 20 రూపాయలు, నన్నారీ25 రూపాయలు, అమ్ముతున్నారు. ఒకప్పుడు పల్లెల్లో తోపుడుబండ్లలో గోలి సోడా పెట్టుకుని వచ్చి గల్లి గల్లి తిరుగుతూ రండి అమ్మా రండి రండి అయ్యా రండి, రండి బాబు రండి చల్లని గోలి సోడా తాగండి అంటూ ఓపెన్ ట్యూబ్ తో గోలి సోడా నువత్తి శబ్దాలు చేస్తూ అందించేవారు. ఆ శబ్దానికి పల్లెటూరి జనం చూడ వచ్చిందని పరుగులు తీసి వేసవిలో తాగేవారు. అలాగే సినిమాల వద్ద సినిమా మధ్యలో ఇంటర్వెల్ విరామ సమయంలో జనం పరిగెత్తిపోయి గోలి సోడా ను తాగేవారు. కాలం మారింది కొత్త కొత్త ఆవిష్కరణలలో భాగంగా సోడా మేకర్ వచ్చేసింది. సీసాలు కడగడం నీరు పోసి గ్యాస్ పట్టే శ్రమ తప్పిపోయింది. నేడు కుళాయి తిప్పి నేరుగా గ్లాస్ లో నిమ్మకాయ పిండి ఇవ్వడం, నన్నారిలో నిమ్మకాయ పిండి ఇవ్వడం జరుగుతుంది. గోలి సోడా తయారీ కేంద్రాలు మూతపడుతున్నా యి దీనితో గోలి సోడా కనుమరుగయ్యే అవకాశం ఉంది. చల్లగా ఉండేందుకు ఐస్ వేసి బాక్స్ లో పెట్టేవారు. ఇప్పుడు కూలింగ్ బాక్స్‌లు వచ్చేశాయి. ఒకప్పుడు రూ.6000 ఉన్నది నేడు రూ.40 వేలకు చేరింది. మనిషి కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదన చేయడం ఎలా అనే దాని పైన దృష్టి సారించడంతో కొత్త కొత్త ఆవిష్కరణలు వచ్చి మనిషికి పని తగ్గించ్చేస్తున్నాయి. ప్రస్తుతం కర్నూల్ నగరంలో కేవలం మూడు ప్రాంతాలలో శ్రీరామ టాకీస్, సుందరయ్య సర్కిల్, పెద్దపడకానా (ఉస్మానియా కళాశాల) ప్రాంతాల్లో మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. పాత తరం వారు ఇప్పటికీ గోలి సోడాను వెతికి వెతికి మరి తాగుతూ ఉంటారు.
గోలి సోడాయే నా జీవనాధారం : కురువ అశోక్ సుందరయ్య సర్కిల్
” తాను గత 20 సంవత్సరాలుగా గోలి సోడాలను అమ్ముకొని జీవనం సాగిస్తున్నా. అప్పటికి ఇప్పటికి ధరలు చాలా పెరిగిపోయాయి. వేసవికాలంలో మాత్రమే వ్యాపారం ఉంటుంది. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అబ్బాయి ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ చదువుతున్నాడు. అమ్మాయి 9వ తరగతి చదువుతోంది. ప్రతిరోజు 3000 రూపాయలు గిరాకీ అయితే ఖర్చులు పోను ₹1000 మిగులుతుంది. ఇక్కడ బంకు పెట్టుకుని గోలి సోడా అమ్ముకుంటున్నందుకు మున్సిపాలిటీ వారికి ట్రేడ్ లైసెన్స్ వెయ్యి రూపాయలు, స్థలం వారికి 3 వేల రూపాయలు ఇస్తున్నా. సీజన్ అన్ సీజన్ అనకుండా గోలి సోడా నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నా. మందు ప్రియులు మందులో సోడా కలిపి తాగడానికి వచ్చి సీసాలు ఇవ్వాలని అడిగితే ఇంతవరకు ఎవరికీ అలా ఇచ్చి ప్రోత్సహించలేదు. “
వేసవిలో మాత్రమే వ్యాపారం ఉంటుంది : పావని, ఇందిరాగాంధీ నగర్
” భర్త లేని సమయంలో గోలి సోడాను 15 సంవత్సరాలుగా అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నాం. గ్యాస్, నిమ్మకాయలు ,ఐస్ ఇలాంటివి తెచ్చుకొని చల్లగా ఉండేటట్లు గోలి సోడాను బండిలో పెట్టుకొని మార్కెట్ యార్డ్ పక్కన రోడ్డుపై పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటాం. రోజుకు ఖర్చులు పోను 1000 రూపాయల వరకు మిగులుతుంది. మిగతా సీజన్లో 300 నుండి 500 రూపాయలు గిరాకీ అవుతుంది. మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పదవ తరగతి, ఒకరు తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. భర్త పొట్టేలు కోయటానికి, చికెన్ షాపుల్లో పనిచేయటానికి వెళుతుంటాడు. పని లేని సందర్భాల్లో మాత్రమే భర్త సోడా బండి పై నిలబడతాడు. ఇంటి పని అయిన తర్వాత ఈ వ్యాపారం చేస్తుంటాను. “








కామెంట్లు (0)