test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మాట్లాడే గుమ్మడికాయ

17 మే, 2026

మాట్లాడే గుమ్మడికాయ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 17, 2026, 07:27 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఒక పల్లెటూరిలో కాంతారావు అనే ఒక చమత్కారి ఉండేవాడు. అతని పక్కింట్లో సూరి అనే ఒకాయన ఉండేవాడు. సూరికి ఒక వింత అలవాటు ఉంది. కాంతారావు ఇంటికి ఏ వస్తువు తీసుకొచ్చినా అది తనదే అని వాదించి తీసుకెళ్లిపోయేవాడు. ఒకరోజు కాంతారావు బజారు నుండి ఒక పెద్ద నిగనిగలాడే గుమ్మడికాయ పట్టుకొచ్చాడు. అది చూడగానే సూరికి ఆశ పుట్టింది. వెంటనే గోడ దూకి వచ్చి, 'ఓయ్ కాంతారావు! ఈ గుమ్మడికాయ మా పెరట్లో పాదు నుంచి నీ ఇంట్లోకి వాలింది. కాబట్టి ఇది నాదే!` అని గొడవ మొదలుపెట్టాడు.

కాంతారావు మనసులో 'సూరితో వాదించి లాభం లేదు` అని ఒక ఒక ప్రణాళిక వేశాడు. కాంతారావు చాలా గంభీరంగా మొహం పెట్టి, 'అయ్యో సూరి గారు! మీరు చెప్పింది నిజమే. కానీ ఈ గుమ్మడికాయకు ఒక వింత వ్యాధి ఉంది. దీన్ని 'మాట్లాడే గుమ్మడి' అంటారు. ఇది రాత్రిపూట దొంగతనం చేసిన వాళ్ల పేర్లు ఊరంతా వినబడేలా అరుస్తుంది. అందుకే దీన్ని ఊరి బయట పారేద్దాం అనుకుంటున్నాను` అన్నాడు. సూరి నవ్వి, 'పోవోయ్! గుమ్మడికాయలు ఎక్కడైనా మాట్లాడతాయా? అబద్ధాలు చెప్పకు, అది నాదే, నేనే తీసుకెళ్తా` అని ఆ కాయను తీసుకెళ్లిపోయాడు. ఆ రాత్రి సూరికి నిద్ర పట్టలేదు. ఎక్కడ గుమ్మడికాయ అరుస్తుందో అని భయం మొదలైంది. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో, కాంతారావు మెల్లగా సూరి ఇంటి కిటికీ దగ్గరకు వెళ్లి, గొంతు మార్చి 'ఓయ్ సూరీ... నువ్వు దొంగవి! నా యజమాని కాంతారావు దగ్గర నుంచి నన్ను ఎత్తుకొచ్చావు. రేపు పొద్దున్నే అందరికీ చెప్పేస్తాను... ఓయ్ సూరీ...!` అని గట్టిగా అరిచాడు.

సూరి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. నిజంగానే గుమ్మడికాయ మాట్లాడుతోందని వణికిపోయాడు. వెంటనే ఆ కాయను పట్టుకుని పరుగు పరుగున వెళ్లి కాంతారావు ఇంటి అరుగు మీద పెట్టేసి, తన ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.

మరుసటి రోజు ఉదయం కాంతారావు ఆ గుమ్మడికాయతో హాయిగా కూర వండుకుంటూ ఉంటే, సూరి నీరసంగా బయటకు వచ్చాడు. కాంతం నవ్వుతూ, 'ఏంటి సూరి గారు, రాత్రి గుమ్మడికాయ ఏమైనా మాట్లాడిందా?` అని అడిగాడు.

సూరి తల గోక్కుంటూ, 'మాట్లాడటమేంటి కాంతారావు.. అది ఏకంగా దండోరా వేస్తోంది! నీ గుమ్మడికాయ నీ దగ్గరే ఉంచుకో నాకు వద్దు!` అని అక్కడి నుంచి జారుకున్నాడు.


బెందాళం సిద్ధార్థ్ 10వ తరగతి,

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,

ముత్యాలపేట.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్