వేసవి సెలవులు కావడంతో రమ, రఘు సీతానగరం లోని అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లారు. సెలవుల్లో ఊళ్లో పిల్లలతో కలిసి బాగా ఆడుకున్నారు. తాతయ్యకు కోళ్ల పెంపకం అంటే చాలా ఇష్టం. ఒకరోజు తాతయ్య ఊరికెళ్తూ కోళ్లను జాగ్రత్తగా చూసుకోమని రఘుతో చెప్పాడు. వాటిని రఘు ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. కానీ అనుకోకుండా ఒకరోజు రఘు ఆడుకుంటూ విసిరిన రాయి ఒక కోడికి తగిలి చనిపోయింది. ఏం చెయ్యాలో తెలియక రఘు వాళ్ల అక్కతో జరిగిన విషయం చెప్పాడు. ఇంటి దగ్గర తనను ఏడిపించే తమ్ముడిని ఈసారి ఎలాగైనా ఏడిపించాలనుకుంది రమ. ‘కోడి విషయం ఎవరికీ చెప్పను. కానీ ఒక షరతు’ అంది. ‘సరే చెప్పు. ఏం చెయ్యాలి’ అన్నాడు రఘు.
‘అమ్మమ్మ నాకు చెప్పే పనులన్నీ నువ్వే చెయ్యాలి. కానీ ఆ విషయం అమ్మమ్మకు తెలియకూడదు. నేనే చేస్తున్నాను అనుకోవాలి’ అని తన షరతులు చెప్పింది రమ. కోడి చనిపోయిన విషయం తెలియకుండా ఉండేందుకు అక్క చెప్పిన షరతులన్నింటికీ రఘు ఒప్పుకున్నాడు. ఆ తరువాత అక్కా తమ్ముడు ఇద్దరూ కలిసి కోడిని ఎవరికీ కనిపించకుండా మట్టిలో పూడ్చిపెట్టారు. ఆ రోజు నుంచి అమ్మమ్మ రమకు చెప్పిన పనులన్నీ రఘు చేశాడు. రోజులు గడిచే కొద్దీ రఘు ఇంటి పనులు చేయలేకపోయాడు. తను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు చేతకాని పనులన్నీ చేయాల్సి వస్తోంది’ అనుకున్నాడు. ధైర్యం చేసి ఒక రోజు అమ్మమ్మకు జరిగిన విషయం మొత్తం చెప్పాడు.
అప్పుడు అమ్మమ్మ ఫక్కున నవ్వి ‘ఆ విషయం నాకు ముందే తెలుసు’ అంది. ‘అయితే నా మీద కోపం లేదా? మరి ఇన్ని రోజులు ఇంటిపనులు చేస్తుంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు’ అని అమ్మమ్మను రఘు నిలదీశాడు. ‘చూడు రఘు.. ఇంటి పనులు చేయడం తప్పు కాదు. అయితే ముందు నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి. నిజం దాచాలని నువ్వు ఈ పనులు చేయడానికి ఒప్పుకున్నావు. అది చాలా తప్పు. నీకై నువ్వు నిజం చెప్పాలనే నేను ఇన్ని రోజులు ఎదురుచూశాను. తప్పు ఎక్కడ బయటపడుతుందో అనుకుని భయంతో నీకు కష్టమైన పనులు ఎన్నో చేశావు. అదే నిజం ముందే ఒప్పుకుంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నిజం చెప్పడంలోనే ప్రశాంతత ఉంటుంది’ అని అమ్మమ్మ రఘుతో వివరంగా చెప్పింది. వీరిద్దరి మాటలు వింటున్న రమను కూడా అమ్మమ్మ దగ్గరకు రమ్మని పిలిచింది. ‘చూడు రమ, తమ్ముడు తెలియక పొరబాటు చేస్తే దాన్ని సరిదిద్దాలి. కానీ నువ్వు అలా చేయలేదు. పైగా వాడి తప్పును కప్పిపుచ్చుకునేందుకు దారి చూపించావు. ఇలా చేయడం సరికాదు’ అని మందలించింది. ఆ రోజు నుండి రమ, రఘు ప్రతి విషయంలో నిజాయితీగా ఉండాలని అనుకున్నారు.
– చోడవరపు మోహిని సుధ,
ప్రజాశక్తి జర్నలిజం విద్యార్థిని
99636 90960.








కామెంట్‌లు (0)