తల్లి:
ఎండ చుర్రుమంటున్నది,
బడికెళ్లే వేళైనది.
బిడ్డా! ఇక మేలుకొనుము,
ఆలస్యం అవుతున్నది!
బాబు:
అమ్మా! ఈ ఒక్కరోజు
ఎగ్గొట్టుట నాకు మోజు.
చక్కని కల చెదరనీయకు,
ఈ కలలో నేను రాజు!
తల్లి:
సూర్యుడలా అనుకుంటే
దినాలన్నీ చీకటే!
ఒకరోజుకి ఏం కాదని
అనుకుంటే పొరపాటే!
బాబు:
అమ్మా! నను విసిగించకు,
మంచి నిద్ర చెడగొట్టకు.
చెల్లాయికి సంచి ఇచ్చి
పంపించుట మర్చిపోకు!
తల్లి:
రెండ్రోజుల పాఠాలని
ఒకేరోజు వ్రాయాలని
మర్చిపోకురా బిడ్డా!
నీకెంతో శ్రమ అగునని!
నెలరోజుల ఇడ్లీలని
ఒకరోజే తినగలవని
నమ్మికతో చెబుతున్నా
నేటినుండి మానాలని!
బాబు: (నవ్వుతూ)
అమ్మా! ఇక నవ్వలేను,
నీకు మాట ఇవ్వలేను.
ఒకే రోజు నెలరోజుల
ఇడ్లీలైతే తినలేను!
తల్లి:
బుద్ధొచ్చిందా, నాయనా!
బడికెళ్లరా ఇకనైనా?
ఏ రోజువి ఆరోజే
చదువుకోరా ఇకపై!
– గుడిపూడి రాధికా రాణి
94949 42583








కామెంట్‌లు (0)