కృతిన్, అద్విక్, విహాన్, ప్రణవ్ స్నేహితులు. నలుగురూ ఏడవ తరగతి పూర్తి చేసుకొని వేసవి సెలవులు పూర్తికాగానే ఎనిమిదవ తరగతిలో చేరబోతున్నారు. ఆ రోజు సాయంత్రం ఆడుకుంటున్న సమయంలో విశ్వనాథం మాష్టారు వారిని చూసి, ‘‘పిల్లలూ, రేపు పగటి వేళ ఎండలో బయటకు రాకుండా ఇంట్లోనే ఉండండి’’ అన్నారు. ‘‘ఎందుకు మాస్టారు?’’ అని కృతిన్ అడిగాడు. ‘‘రేపు మన ఊరిలో ఎండ ఎక్కువగా ఉంటుందట. వాతావరణ శాఖ వారు చెప్పారు’’ అన్నారు మాష్టారు. పిల్లలు నలుగురూ ఎండ నుంచి తప్పించుకొని ఎలా ఆడాలా అని ఆలోచిస్తూ ఇళ్లకు వెళ్లారు. కొంత సమయం గడిచింది. అప్పుడు వాళ్లకు ఒక చిలిపి ఆలోచన కలిగింది. సెల్ఫోన్ తీసుకొని గూగుల్ తెరిచి, ‘‘హలో గూగుల్! రేపు మేము ఆడుకున్నా ఎండ వేడి ఎక్కువగా తగలకుండా ఏదైనా ఆలోచన చెప్పవా?’’ అన్నాడు కృతిన్.
‘‘ఈ సంవత్సరం మీకు అవకాశం లేదు. మీ తల్లిదండ్రులు బయటకు వెళ్లడానికి అనుమతించరు. వచ్చే సంవత్సరం ఎండకాలంలో ఆడుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నించండి’’ అంటూ గూగుల్ సమాధానమిచ్చింది. ‘‘ఏం చేయాలి?’’ అని అడిగాడు అద్విక్. ‘‘చెట్లు నాటండి. వచ్చే వేసవి సెలవుల నాటికి పెద్దవవుతాయి. ఆ నీడలో ఆడుకోవచ్చు’’ అంటూ గూగుల్ సమాధానమిచ్చింది. పిల్లలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండగా, నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచాడు విహాన్. ‘‘ఓహో! ఇదంతా కలా!’’ అనుకుంటూ స్నేహితులకు ఆ కల గురించి చెప్పాడు. అంతా విన్న పిల్లలందరూ ఒక అభిప్రాయానికి వచ్చారు. ‘‘నీడ కోసం ఈ రోజే ఖాళీ స్థలంలో చెట్లు నాటాలి’’ అనుకున్నారు. అమ్మానాన్నలకు చెప్పి కావాల్సినవి తెప్పించుకొని ఆరుబయట ఖాళీ స్థలం వైపు వెళ్లారు.
- ఓట్ర ప్రకాశ్ రావు
కొలంబస్, USA
97874 46026









కామెంట్లు (0)