test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకందుకూరి ఆశయ సాధనకు పునరంకితమవుదాం : ఐద్వా

27 మే, 2026

aidwa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 27, 2026, 11:55 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మహిళలపై అణచివేతను అరికట్టి, వారికి విద్య అందించాలని కందుకూరి వీరేశలింగం కన్న కలలు నేటికీ నెరవేరలేదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కమిటీ పేర్కొంది. నవయుగ వైతాళికులు, గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం వర్ధంతి సందర్భంగా ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా అఖిల భారత మాజీ నాయకులు డి రమాదేవి మాట్లాడుతూ.. సమాజంలో మహిళలను అణగదొక్కే మూఢ నమ్మకాలు, బాల్య వివాహాలు, వితంతువుల పట్ల అమానుష ఆచారాలు తీవ్రంగా ఉన్నకాలంలో వాటిని ధైర్యంగా ఎదిరించి మహిళా విముక్తి కోసం పోరాడిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు అని కొనియాడారు. మహిళలపై నేటికీ శీల పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఒంటరి, వితంతు మహిళలపై అనేక రూపాల్లో అమానుషాలు కొనసాగుతు న్నాయని పేర్కొన్నారు. మగవాళ్ళు మూడు పెళ్లిళ్లు చేసుకున్నా.. తప్పుపట్టని సమాజం.. స్త్రీల పునర్వివాహం గురించి కనీస ఆలోచన కూడా చేయడం లేదని గుర్తించి వీరేశలింగం ముందు చూపుతో వితంతు వివాహాలను ప్రోత్సహించారని చెప్పారు. 1874లో వివేకవర్ధిని పత్రికను స్థాపించి మహిళా స్వేచ్ఛపై, మూఢనమ్మకాలపై తీవ్రంగా రచనలు కొనసాగించారని తెలిపారు. మహిళా సమానత్వం, విద్య, స్వేచ్ఛ కోసం కందుకూరి చూపిన మార్గంలోనే ముందుకు సాగడం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళిగా పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి వి సావిత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో మహిళల స్వేచ్ఛ, హక్కులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కందుకూరి ఆశయాలకు పురంకితం కావాలని పిలుపునిచ్చారు. మహిళలను పిల్లలను కనే యంత్రాలుగా మాత్రమే చూసే ప్రస్తుత పాలకుల విధానాలకు వ్యతిరేకంగా, మతఛాందస భావజాలాన్ని ఎదిరించడంలో ఐద్వా.. కందుకూరి స్ఫూర్తితో కృషి చేయాలన్నారు. రాష్ట్ర అధ్యక్షులు కె శ్రీదేవి మాట్లాడుతూ.. లింగ సమానత్వం కోసం కందుకూరి చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గంలోనే మహిళా విముక్తి సమాన హక్కుల సాధన కోసం ఐద్వా ఉద్యమాలను కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు టి శ్రీదేవి, జి క్రాంతి, పార్వతి, సామ్రాజ్యం, పద్మ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్